Chandrababu: మీడియాకు సంకెళ్లు వేసి ఈ ప్రభుత్వం దారుణంగా ప్రవర్తిస్తోంది: నిరసనలో పాల్గొన్న చంద్రబాబు
- వెంటనే 2430 జీవోను రద్దు చేయాలి
- నిషేధాన్ని ఎత్తేయాలి
- పత్రికా స్వేచ్ఛను కాపాడాలి
- ప్రశ్నించిన వారిపై దాడులు చేయడం మంచి పద్ధతి కాదు
వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. వెంటనే 2430 జీవోను రద్దు చేసి, నిషేధాన్ని ఎత్తేయాలని ఆయన డిమాండ్ చేశారు. అసెంబ్లీ ప్రసారాలు చేయకుండా కొన్ని ఛానెళ్లను అడ్డుకోవడం దారుణమంటూ చంద్రబాబు నేతృత్వంలో అమరావతిలోని సచివాలయం ఫైర్ స్టేషన్ ఎదుట ఈ రోజు టీడీపీ నేతలు నిరసన తెలిపారు.
పత్రికా స్వేచ్ఛను కాపాడే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఈ సందర్భంగా చంద్రబాబు స్పష్టం చేశారు. మీడియాకు సంకెళ్లు వేసి ఈ ప్రభుత్వం దారుణంగా ప్రవర్తిస్తోందన్నారు. 2430 జీవో తీసుకొచ్చి బెదిరించడం దుర్మార్గమని అన్నారు. ప్రశ్నించిన వారిపై దాడులు చేయడం మంచి పద్ధతి కాదని విమర్శించారు. ప్రజాస్వామ్య వ్యవస్థను ఎవరూ నాశనం చేయలేరని వ్యాఖ్యానించారు.