Raghuram krishnam raju: విందుపై ఎవరికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు: వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు
- నేను ఎన్నో పార్టీలకు హాజరవుతుంటా
- వాటికి వెళ్లేందుకు ఎవరి పర్మిషను తీసుకోలేదు
- ఇప్పుడు నేనిచ్చే విందుకు అనుమతి ఎందుకు?
ఢిల్లీలో ఎంపీలు, కేంద్ర మంత్రులకు ఇచ్చిన విందుపై తాను ఎవరికీ వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదని నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంపీగా తాను ఎన్నో పార్టీలకు హాజరవుతుంటానని, అప్పుడెవరి పర్మిషనూ తీసుకోలేదని, ఇప్పుడు కూడా విందు గురించి ఎవరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని తెగేసి చెప్పారు. విందు కోసం ముందుగా తమ పార్టీ సభ్యులనే ఆహ్వానించానని, ఆ తర్వాతే మిగతా వారికి చెప్పానని పేర్కొన్నారు. బడా నేతలతో సఖ్యత పెంచుకోవాలనుకుంటే కనుక వారిని సీక్రెట్‌గా పిలిచేవాడినని, ఇలా అందరికీ తెలిసేలా ఎందుకు చేస్తానని ప్రశ్నించారు.
కాగా, సబార్డినేట్ లెజిస్లేచర్ కమిటీ అధ్యక్షుడి హోదాలో నిన్న రాత్రి రఘురామ కృష్ణంరాజు సహచర ఎంపీలకు విందు ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని న్యూ ఎంపీ క్వార్టర్స్‌లోని వెస్ట్రన్ కోర్టులో ఇచ్చిన ఈ విందుకు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా పలువురు ఎంపీలు హాజరయ్యారు. టీడీపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ ఎంపీలు కూడా విందుకు హాజరయ్యారు.