america: అమెరికాలో మళ్లీ గర్జించిన తుపాకి.. ఇద్దరు అనుమానితుల సహా ఆరుగురి మృతి
- న్యూజెర్సీ నగరంలోని జెర్సీలో ఘటన
- ట్రక్కులో వచ్చి కాల్పులు జరిపిన దుండగులు
- ఎదురు కాల్పుల్లో ఓ పోలీసు అధికారి, ఇద్దరు పౌరులు మృతి
అమెరికాలో తుపాకి మరోమారు గర్జించింది. న్యూజెర్సీలోని జెర్సీ నగరంలో జరిగిన కాల్పుల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ముగ్గురు పౌరులు, ఇద్దరు అనుమానిత నిందితులు, ఓ పోలీసు ఉన్నతాధికారి ఉన్నారు. మరో ఇద్దరు పోలీసులు, పౌరుడు గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. నిన్న మధ్యాహ్నం ట్రక్కులో ఘటనా స్థలానికి వచ్చిన దుండగులు ఒక్కసారిగా కాల్పులు ప్రారంభించారు.
సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులపైకి దుండగులు కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు ఎదురుకాల్పులు ప్రారంభించారు. పోలీసులకు, దుండగులకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. వందల రౌండ్ల కాల్పులు జరిపినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా, మృతి చెందిన పోలీసు అధికారి గతంలో తుపాకి విషసంస్కృతి నిర్మూలనకు కృషి చేయడం గమనార్హం.