Disha: 'దిశ' ఎన్కౌంటర్ మృతుల్లో మైనర్లు ముగ్గురా?
- ఆధార్ వివరాలకు, బోనఫైడ్ సర్టిఫికెట్లకు కుదరని లంకె
- బోనఫైడ్ సర్టిఫికెట్ల ప్రకారం ముగ్గురు మైనర్లు
- వయసు నిర్ధారణ ఎలా అన్నదానిపై చర్చ
చటాన్‌పల్లి వద్ద జరిగిన దిశ హత్యాచార నిందితుల ఎన్కౌంటర్ కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. నిందితుల్లో ఇద్దరు మైనర్లు ఉన్నారన్న విషయం మొన్న వెలుగులోకి రాగా, ఇద్దరు కాదు, ముగ్గురన్న విషయం నిన్న బయటపడింది. హతులకు సంబంధించి అందుబాటులో ఉన్న వయసు ధ్రువీకరణ పత్రాలు పరస్పర విరుద్ధంగా ఉండడంతో వారి వయసును ఎలా నిర్ధారిస్తారన్న విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఎన్కౌంటర్ తర్వాత నిందితులందరూ మేజర్లేనని పోలీసులు వెల్లడించాడు. వారి వయసు 20 సంవత్సరాల పైమాటేనని చెప్పారు. అయితే, వారికి సంబంధించిన స్కూల్ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డులలో వారి వయసు 18 ఏళ్లలోపే అని ఉండడంతో అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ఆధార్ వివరాలను బట్టి నిందితుల పుట్టిన సంవత్సరం 2001గా ఉంది. అయితే, స్కూల్ బోనఫైడ్ సర్టిఫికెట్లు ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి. బోనఫైడ్ సర్టిఫికెట్ల ప్రకారం వీరిలో ఒకరి పుట్టిన తేదీ 15 ఆగస్టు 2002 కాగా, మరొకరి పుట్టిన రోజు 10 ఏప్రిల్ 2004. తాజాగా, మరో నిందితుడి కుటుంబ సభ్యులు కూడా తమ కుమారుడి బోనఫైడ్ సర్టిఫికెట్‌ను మంగళవారం సేకరించారు. దాని ప్రకారం అతడు పుట్టింది 4 ఏప్రిల్ 2004. అంటే అతడి వయసు 16 ఏళ్లలోపే. దీనిని బట్టి నలుగురు నిందితుల్లో ముగ్గురు మైనర్లేనన్నమాట.
సాధారణంగా వయసును ధ్రువీకరించేందుకు పత్రాలేవీ లేనప్పుడు ఎముకల దృఢత్వం ఆధారంగా వయసును నిర్ధారిస్తారు. అయితే, ఇది కూడా పక్కాగా ఉండదు. కొంచెం అటూఇటుగా ఉంటుంది. ఇంకొన్ని సార్లు స్థానికంగా విచారించి కూడా వారి వయసును నిర్ధారిస్తారు. అయితే, ప్రస్తుతం నిందితుల వయసును ఎలా నిర్ధారిస్తారనేది ఆసక్తిగా మారింది.