Andhra Pradesh: సబ్సిడీపై ఇచ్చిన ఉల్లిపాయలనే టీడీపీ నేతలు దండలుగా వేసుకొచ్చారు: మంత్రి మోపిదేవి సెటైర్లు
- రాజకీయ ఉనికిని కాపాడుకోవడం కోసమే ఇలా చేశారు
- దేశం మొత్తంలో ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి
- టీడీపీ నేతల రాద్ధాంతం తగదు
ఉల్లి ధరలపై రాద్ధాంతం చేస్తున్న టీడీపీ నేతలు, తమ ప్రభుత్వం సబ్సిడీపై ఇచ్చిన ఉల్లిపాయలనే దండలుగా వేసుకొచ్చారని ఏపీ మంత్రి మోపిదేవి వెంకటరమణ సెటైర్లు వేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, సబ్సిడీపై ఇచ్చిన ఉల్లిపాయలు పది మందికి ఉపయోగపడకుండా చేశారని, వారి రాజకీయ ఉనికిని కాపాడుకోవడం కోసం ఉల్లి దండలు వేసుకొచ్చారని విమర్శించారు.
ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతున్న పరిస్థితి యావత్తు దేశంలో వుందని, కేవలం, ఏపీలోనే కాదని అన్నారు. భారతదేశంలో రైతులు ఉల్లి పంటలు వేయడం క్రమేపి తగ్గడం, పంట చేతికొచ్చే దశలో అధిక వర్షాలు కురవడం వల్ల దిగుబడి తగ్గుతోందని అన్నారు. అందువల్ల ఉల్లి కొరత ఏర్పడి, ధరలు పెరిగిపోయాయని చెప్పారు. దేశంలో ఎక్కువగా ఉల్లిపాయలు సరఫరా చేసే రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఒకటని, ఆంధ్రాలో రాయలసీమ ప్రాంతాలు, రాజధాని అమరావతి రాకముందు మందడం, ఎర్రబాలెంలో ఉల్లి పంటలు ఉన్నాయని, ప్రత్యక్షంగా ఈ రోజు తాను చూశానని చెప్పారు.