YSRCP: నన్ను విమర్శించడానికే ఎక్కువ సమయం కేటాయించారు: వైసీపీ సభ్యులపై చంద్రబాబు విమర్శ
- ‘రైతు భరోసా’పై మాట్లాడమంటే నన్ను విమర్శించారు
- అందుకు రిప్లై ఇచ్చి నా సమయం వృథా చేసుకోను
- రైతులకు ఇచ్చిన హామీ విషయంలో మడమ తిప్పారు
రైతు భరోసా పథకం గురించి మాట్లాడమంటే వైసీపీ సభ్యులు ఎక్కువ మంది తనను విమర్శించడానికే ఎక్కువ సమయం కేటాయించారని, అందుకు రిప్లై ఇచ్చి తన సమయం వృథా చేసుకోదలచుకోలేదని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఈరోజు ఆయన మాట్లాడుతూ, ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన హామీలను వైసీపీ ప్రభుత్వం నిలబెట్టుకోలేదని విమర్శించారు.
‘మాట తప్పం మడమ తిప్పం’ అని చెప్పుకునే వైసీపీ నేతలు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడాన్ని ఏమనాలో వారే చెప్పాలంటూ వైసీపీ సభ్యులను ప్రశ్నించారు. రైతులకు రూ.12,500 ఇస్తామని చెప్పి రూ.7,500కు మడమతిప్పిన వైసీపీ సభ్యులకు మాట్లాడే హక్కు లేదని అన్నారు.
టీడీపీ హయాంలో ప్రవేశపెట్టిన రైతు రుణమాఫీ పథకం కింద నాలుగు, ఐదు విడతలకు చెందిన డబ్బులు ఇవ్వాల్సిన బాధ్యత వైసీపీ ప్రభుత్వంపై వుందని, ఇవ్వనిపక్షంలో ఇప్పించే బాధ్యత తమపై వుంటుందని చెప్పారు. వడ్డీతో సహా ఆ సొమ్ము రైతులకు వచ్చేలా తాను పోరాడతానని, అవసరమైతే, కోర్టుకు వెళతామని హెచ్చరించారు.