Jagan: కావాలంటే కళ్లద్దాలు సరి చేసుకొని చదువుకోండి: అసెంబ్లీలో సీఎం జగన్ చురక
- మేనిఫెస్టోనే మాకు బైబిల్, ఖురాన్, భగవద్గీత
- ఈ విషయాన్ని చెబుతూ మా మేనెఫెస్టోను విడుదల చేశాం
- మొదట బియ్యం గురించి అవగాహన పెంచుకోండి
- చంద్రబాబు పాలనలో ప్రజలకు నాణ్యమైన బియ్యం అందలేదు
పాదయాత్రలో ప్రజల నుంచి ఎన్నో సూచనలు తీసుకున్నానని, ఆ తర్వాత ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఈ రోజు అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ... 'అప్పట్లో టీడీపీ తమ ఎన్నికల మేనిఫెస్టోను ఆన్ లైన్ లో నుంచి తీసేసింది. మేమలా చేయట్లేదు. మా మేనిఫెస్టో అందరికీ అందుబాటులోనే ఉంది. ఈ మేనిఫెస్టోనే మాకు బైబిల్, ఖురాన్, భగవద్గీత.. ఈ విషయాన్ని చెబుతూ మా మేనెఫెస్టోను ఎన్నికల ముందు విడుదల చేశాం' అని అన్నారు.
'ఇందులో ఉన్న ప్రతి అంశం మేము అమలు చేస్తామని ఓట్లు అడిగాం. చాలా ప్రధాన విషయం ఏంటంటే దీంట్లో ఎక్కడా మేము బియ్యం గురించి పేర్కొనలేదు. మేనిఫెస్టోలో చెప్పని అంశాలను కూడా అమలు చేస్తున్నాం. కావాలంటే కళ్లద్దాలు సరి చేసుకొని చదువుకోండి.. ఎవరైనా చదువుకోవచ్చు' అని అన్నారు.
'మొదట బియ్యం గురించి అవగాహన పెంచుకోండి. చంద్రబాబు పాలనలో ప్రజలకు నాణ్యమైన బియ్యం అందలేదు. మేము మాత్రం నాణ్యతతో కూడిన బియ్యాన్ని అందిస్తున్నాం. చంద్రబాబు పాలనలో ప్రజలు తినలేని నాసిరకపు బియ్యాన్ని అందించారు. నాణ్యమైన బియ్యాన్ని అందించే కార్యక్రమాన్ని మేము శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ప్రవేశపెట్టాం' అని జగన్ వ్యాఖ్యానించారు.