Andhra Pradesh: సెల్‌ఫోన్ కొనివ్వలేదని.. ఇనుప రాడ్డుతో భర్తపై భార్య దాడి

  • ఏపీలోని కాకినాడలో ఘటన
  • గత కొంతకాలంగా సెల్‌ఫోన్ కోసం భార్య గొడవ
  • రోజులు గడిపేస్తుండడంతో ఆగ్రహంతో దాడి

సెల్‌ఫోన్ కొనివ్వమని అడుగుతున్నా భర్త పట్టించుకోవడం లేదన్న కోపంతో ఊగిపోయిన ఇల్లాలు అతడిపై ఇనుపరాడ్డుతో దాడిచేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక తారకరామానగర్‌కు చెందిన పర్ల నిత్యానందం, కుమారి ప్రియదర్శిని భార్యాభర్తలు. తనకు సెల్‌ఫోన్ కొనివ్వాలంటూ కుమారి గత కొంతకాలంగా భర్తను అడుగుతోంది. ఆమె అడిగిన ప్రతిసారీ తర్వాత కొనిస్తానని చెబుతూ భర్త రోజులు గడిపేస్తున్నాడు.

ఇదే విషయమై సోమవారం ఇద్దరి మధ్య మరోమారు గొడవ జరిగింది. తనకు ఫోన్ ఇవ్వాల్సిందేనని కేకలు వేసింది. ఈ కోపంలో ఏడాది వయసున్న కొడుకును కొట్టి ఏడిపించింది. దీంతో కొడుకును ఒళ్లోకి తీసుకునేందుకు భర్త ప్రయత్నించాడు. అప్పటికే ఆగ్రహంతో ఊగిపోతున్న కుమారి ఫ్యాన్ రాడ్డుతో భర్త తలపై దాడిచేసింది. దీంతో నిత్యానందం తలచిట్లి తీవ్ర రక్తస్రావమైంది. స్థానికులు వెంటనే అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Andhra Pradesh
kakinada
wife
cell phone
  • Loading...

More Telugu News