India: విండీస్ వీరబాదుడు... రెండో టీ20 మ్యాచ్ లో భారత్ ఓటమి
- భారత్ స్కోరు 170/7
- 18.3 ఓవర్లలోనే ఛేదించిన విండీస్
- విజృంభించిన విండీస్ టాపార్డర్
తిరువనంతపురంలో జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో వెస్టిండీస్ జట్టు ఘనవిజయం సాధించింది. సిరీస్ లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో కరీబియన్లు అన్నిరంగాల్లో భారత్ పై ఆధిపత్యం చెలాయించారు. భారత్ విసిరిన 171 పరుగుల లక్ష్యాన్ని 18.3 ఓవర్లలో కేవలం 2 వికెట్ల నష్టానికి ఛేదించారు. ఓపెనర్ లెండిల్ సిమ్మన్స్ 67 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును గెలుపుతీరాలకు చేర్చాడు. సిమ్మన్స్ స్కోరులో 4 ఫోర్లు, 4 సిక్సులున్నాయి.
మరో ఓపెనర్ ఎవిన్ లూయిస్ 3 సిక్సులు, 3 ఫోర్ల సాయంతో 40 పరుగులు చేయగా, వన్ డౌన్ బ్యాట్స్ మన్ షిమ్రోన్ హెట్మెయర్ మెరుపుదాడి చేశాడు. ఈ లెఫ్ట్ హ్యాండర్ 14 బంతుల్లో 3 సిక్సర్ల సాయంతో 23 పరుగులు చేశాడు. హెట్మెయర్ అవుటైనా నికొలాస్ పూరన్ వచ్చి ఎడాపెడా బాదడంతో భారత్ కు నిరాశ తప్పలేదు. పూరన్ కేవలం 18 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 38 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
ఈ మ్యాచ్ లో విండీస్ బ్యాట్స్ మెన్ భారత బౌలర్లు ఎలా విసిరినా బంతిని స్టాండ్స్ లోకి పంపాలన్నంత కసితో ఆడారు. టీమిండియా బౌలర్లలో వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా చెరో వికెట్ తో సరిపెట్టుకున్నారు. అంతకుముందు, టాస్ ఓడిన టీమిండియా మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 7 వికెట్లకు 170 పరుగులు చేసింది. శివమ్ దూబే 54 పరుగులతో టాప్ స్కోరర్. కాగా, ఈ మ్యాచ్ లో విజయంతో మూడు టీ20ల సిరీస్ ను విండీస్ 1-1తో సమం చేసింది. ఇరుజట్ల మధ్య మూడోదైన చివరి టీ20 డిసెంబరు 11న ముంబయి వాంఖెడే మైదానంలో జరగనుంది.