Kamal Haasan: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్న కమల్!
- కొన్నాళ్ల కిందట మక్కల్ నీది మయ్యం పార్టీ స్థాపించిన కమల్
- స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయరాదని తాజా నిర్ణయం
- సార్వత్రిక ఎన్నికల్లోనూ పోటీ చేయని మక్కల్ నీది మయ్యం
లోకనాయకుడు కమల్ హాసన్ రాజకీయాల్లో ప్రవేశించిన తర్వాత ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. మక్కల్ నీది మయ్యం పేరుతో పార్టీ స్థాపించిన కమల్ గత సార్వత్రిక ఎన్నికల సమయంలో తన పార్టీ అభ్యర్థులను బరిలో దింపలేదు. స్థానిక సంస్థల ఎన్నికలతో బోణీ చేస్తారనుకుంటే అది కూడా వీలయ్యేలా కనిపించడంలేదు. తమిళనాడు స్థానిక సంస్థల ఎన్నికల్లో మక్కల్ నీది మయ్యం పార్టీ పోటీచేయబోవడంలేదని కమల్ హాసన్ తాజాగా ప్రకటించారు.
తాజా పరిణామం రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కమల్ 2021 అసెంబ్లీ ఎన్నికలనే టార్గెట్ చేసినట్టు తాజా నిర్ణయం చెబుతోందని తమిళ రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. రజనీకాంత్ కూడా తమతో కలిసివస్తే తమిళ రాజకీయాల్లో ప్రబల శక్తిగా ఎదగొచ్చన్నది కమల్ ఆలోచన. అయితే ఇప్పటికిప్పుడు రజనీకాంత్ నుంచి స్పష్టమైన కార్యాచరణ కనిపించడంలేదు. రజనీ బీజేపీతో సన్నిహితంగా ఉండేందుకు ప్రయత్నిస్తుండడం కమల్ పై ప్రభావం చూపిస్తోంది. తమిళనాడులో స్థానిక సంస్థల ఎన్నికలు రెండు విడతలుగా నిర్వహించనున్నారు. డిసెంబరు 27న తొలి విడత, డిసెంబరు 30న మలివిడత ఎన్నికలు జరగనున్నాయి.