unnao: ఎట్టకేలకు అంత్యక్రియలకు ఒప్పుకున్న 'ఉన్నావో' బాధితురాలి కుటుంబ సభ్యులు.. భారీ భద్రత నడుమ అంతిమ యాత్ర
- సీఎం వచ్చి హామీ ఇవ్వాలన్న బాధిత కుటుంబం
- బాధిత కుటుంబంతో మాట్లాడి ఒప్పించిన పోలీసులు
- అంతిమ యాత్రలో పెద్ద ఎత్తున పాల్గొన్న ప్రజలు
ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావో అత్యాచార బాధితురాలి మృతిపై సీఎం యోగి ఆదిత్యానాథ్ వెంటనే స్పందించి తమ వద్దకు వచ్చి న్యాయం చేస్తామని హామీ ఇస్తేనే ఆమె అంత్యక్రియలు నిర్వహిస్తామని చెప్పిన బాధితురాలి కుటుంబ సభ్యులు వెనక్కి తగ్గారు. లక్నో డివిజనల్ కమిషనర్ ముఖేశ్ మెష్ రామ్ తో పాటు ఇతర పోలీసు అధికారులు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆమె అంత్యక్రియలను నిర్వహించారు.
భారీ పోలీసు భద్రత నడుమ ఆమె అంతిమ యాత్ర కొనసాగింది. ఇందులో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సమాజ్ వాదీ పార్టీ నేతలు కూడా అంతిమ యాత్రకు హాజరయ్యారు. కాగా, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అంతకు ముందు ఆమె కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. యోగి ఆదిత్యనాథ్ వచ్చే వరకు తమ కూతురు అంత్యక్రియలు నిర్వహించబోమని బాధితురాలి కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. ఉన్నావోకు చెందిన ఆ యువతిపై గతేడాది ఓ యువకుడు అత్యాచారం చేయడంతో ఆ మృగాడిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే, ఇటీవల బెయిల్ పై బయటకు వచ్చి, బాధితురాలిపై మరికొందరితో కలిసి దాడి చేసి, ఆమె ఒంటికి నిప్పంటించాడు. దీంతో ఆసపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది.