Krishna River: కృష్ణా నదిలో దూకిన యువతి... అక్కడే 'నో యాక్సిడెంట్ డే' నిర్వహిస్తున్న పోలీసులు చూసి...!
- పులిగడ్డ - పెనుముడి వారధిపై నుంచి దూకిన యువతి
- వెంటనే కాపాడిన ఏఎస్ఐ, కానిస్టేబుల్
- యువతిని కాపాడినందుకు ప్రశంసల వర్షం
పులిగడ్డ - పెనుముడి వారధిపై నుంచి ఆత్మహత్య చేసుకోవాలన్న ఉద్దేశంలో ఉన్న ఓ యువతి కృష్ణానదిలో దూకగా, అక్కడికి దగ్గరలోనే 'నో యాక్సిడెంట్ డే' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పోలీసులు చూసి, వెంటనే స్పందించారు. యువతి దూకడాన్ని చూసిన ఏఎస్ఐ మాణిక్యాలరావు, కానిస్టేబుల్ గోపిరాజు వెంటనే నదిలో దూకి, ఆమెను పట్టుకుని కాపాడారు. యువతిని క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. ఘటనపై కేసును నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.
యువతి ప్రాణాలను కాపాడిన మాణిక్యాలరావు, గోపిరాజులను పోలీసు ఉన్నతాధికారులతో పాటు స్థానికులు అభినందించారు. మాణిక్యాలరావు మరికొద్ది రోజుల్లో పదవీ విరమణ చేయనున్నారని తెలుస్తోంది. యువతి ఆత్మహత్యకు ప్రయత్నించిన సమయంలో అక్కడికి దగ్గర్లోనే అవనిగడ్డ పోలీసులు 'నో యాక్సిడెంట్ డే' నిర్వహిస్తుండటం వల్లే యువతి ప్రాణాలు దక్కాయని అంటున్నారు.