Chittoor District: అదనపు కట్నం కోసం భార్య గొంతు కోసిన భర్త

  • చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఘటన
  • అదనపు కట్నం కోసం వేధింపులు
  • భార్య పరిస్థితి విషమం

అదనపు కట్నం కోసం భార్యను వేధిస్తున్న భర్త ఆమెను హతమార్చేందుకు యత్నించాడు. కత్తితో దాడిచేసి విచక్షణ రహితంగా పొడిచాడు. చిత్తూరు జిల్లాలోని మదనపల్లెలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. పెద్దమండ్యం మండలంలోని కలిచెర్లకు చెందిన సయ్యద్ హుస్సేన్‌వల్లి, గొర్రంకొండకు చెందిన సయ్యద్ సల్మా (24) భార్యా భర్తలు. ఆరేళ్ల క్రితం పెళ్లైన వీరికి ఆలియా (5), ఇలాహి (4) ఇద్దరు సంతానం. కొన్నాళ్ల క్రితం వరకు బెంగళూరులో ఎలక్ట్రీషియన్‌గా పనిచేసిన హుస్సేన్‌వల్లి ఏడాది క్రితం మదనపల్లికి వచ్చి ఆటో నడుపుకుని జీవిస్తున్నాడు.

గత కొన్నాళ్లుగా హుస్సేన్‌వల్లి అదనపు కట్నం తీసుకురావాలంటూ భార్యను వేధించడం మొదలుపెట్టాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు ఇద్దరినీ పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు. అయినప్పటికీ తీరుమారని హుస్సేన్ శుక్రవారం మారోమారు అదనపు కట్నం కోసం వేధించాడు. అనంతరం కత్తితో భార్య గొంతు కోశాడు. వీపుపై పొడిచాడు. సల్మా గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి అతడిని అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని, పెనుగులాటలో గాయపడిన నిందితుడిని ఆసుపత్రికి తరలించారు. సల్మా పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి బెంగళూరుకు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Chittoor District
dowry
Crime News
Andhra Pradesh
  • Loading...

More Telugu News