Amit Shah: అమిత్ షా కుమారుడు బీసీసీఐలో కీలకపదవిలో ఉండడం పట్ల గంగూలీ స్పందన
- బీసీసీఐ కార్యదర్శిగా జయ్ షా
- ఎన్నికల్లో నెగ్గి పదవిని చేపట్టాడన్న గంగూలీ
- ఇంటి పేరు చూసి మాట్లాడడం మానుకోవాలని హితవు
ప్రముఖ వ్యక్తులు క్రికెట్ బోర్డులో ఉండడం వల్ల ఎలాంటి నష్టం లేదని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తనయుడు జయ్ షా బీసీసీఐ కార్యదర్శిగా ఉండడం పట్ల గంగూలీ స్పందించారు. జయ్ షా తన తండ్రి పేరును ఉపయోగించుకోకుండా, బోర్డు ఎన్నికల్లో గెలవడం ద్వారా కార్యదర్శి పదవి చేపట్టారని గంగూలీ తెలిపారు.
గుజరాత్ క్రికెట్ సంఘంతో జయ్ షాకు ఎంతో అనుబంధం ఉందని, ఆరేళ్లుగా గుజరాత్ క్రికెట్ బోర్డుకు అనేక విధాలుగా సేవలు అందించారని వెల్లడించారు. ఇంటి పేర్లు చూసి మాట్లాడడం కాదని, వాటికి అతీతంగా ఆలోచించడం అలవర్చుకోవాలని హితవు పలికారు. ఇలాంటివి ఎక్కువగా భారత్ లోనే కనిపిస్తాయని అసహనం వ్యక్తం చేశారు. ఎవరి కొడుకైనా మంచివాడా, చెడ్డవాడా అనే విషయాలనే పరిగణనలోకి తీసుకోవాలని గంగూలీ స్పష్టం చేశారు.