Ramgopal verma: ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమాకు సెన్సార్ గ్రీన్ సిగ్నల్
- రివైజింగ్ కమిటీ యూ/ఏ సర్టిఫికెట్ జారీ
- సినిమా విడుదల తేదీ ఖరారే మిగిలింది
- కొన్ని కట్లతో సినిమాకు అనుమతి జారీ చేసిన కమిటీ
రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న ‘అమ్మరాజ్యంలో కడప బిడ్డలు’ సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయింది. సెన్సార్ బోర్డు రివైజింగ్ కమిటీ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. సినిమాలో కొన్ని సన్నివేశాలను కత్తిరించిన సెన్సార్ బోర్డు సినిమాకు సర్టిఫికెట్ ను జారీచేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, ఇక సినిమా విడుదల తేదీని నిర్మాత, దర్శకుడు ఖరారు చేయడమే మిగిలింది. తొలుత ఈ సినిమాకు కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అన్న టైటిల్ ను నిర్ణయించారు.
ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడానికి ప్రాంతీయ సెన్సార్ బోర్డు నిరాకరించింది. సినిమాలో కొన్ని అభ్యంతరకర సన్నివేశాలు, కులాల పేర్లు.. ఉన్నాయని సెన్సార్ బోర్డు ఆక్షేపించింది. దీంతో సినిమా నిర్మాతలు రివైజింగ్ కమిటీని ఆశ్రయించారు. తొమ్మిది మంది సభ్యులతో కూడిన రివైజింగ్ కమిటీ సినిమాను చూసి కొన్ని సన్నివేశాలను కట్ చేసి సెన్సార్ సర్టిఫికెట్ ను జారీ చేసింది. మరోపక్క సినిమా కథనంతోపాటు దీని టైటిల్ ను సవాల్ చేస్తూ..కోర్టులో పలు పిటిషన్లు దాఖలయిన విషయం తెలిసిందే. ఈ విషయాలన్నీ తేలిన తర్వాతే సినిమా విడుదల తేదీ ఖరారు కానుందని తెలుస్తోంది.