Vice-president: చట్టాల ద్వారానే మార్పు రాదు, అందరూ బాధ్యతగా ఉండాలి: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
- అత్యాచార ఘటనలపై వెంకయ్యనాయుడి ఆవేదన
- ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదు
- కీచకుల్లో మార్పు రావాలే తప్ప కొత్త చట్టాలతో ప్రయోజనం ఉండదు
అత్యాచార ఘటనలపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ఇవాళ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వుండాలంటే సమాజంలో మార్పు రావాలని కోరారు.
చట్టాల ద్వారానే మార్పు రాదని, సమాజంలో మార్పు కోసం అందరూ బాధ్యతగా ఉండాలని సూచించారు. సమాజంలో విలువలు వుంటే దిశ లాంటి ఘటనలకు ఆస్కారం వుండదని అన్నారు. దిశ లాంటి ఘటనల్లో వెంటనే కేసులు నమోదు చేయాలని సూచించారు. కీచకుల్లో మార్పు రావాలే తప్ప వారిని కఠినంగా శిక్షించేందుకు కొత్త చట్టాలు తీసుకొచ్చిన ప్రయోజనం వుండదని అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా భారతీయ సంస్కృతి గురించి ఆయన మాట్లాడారు. మన సంస్కృతిని ప్రపంచ దేశాలు గౌరవిస్తున్నాయని, సంస్కృతిని కాపాడుకుంటే మంచి నడవడిక అలవడుతుందని అన్నారు.