Nara Lokesh: ఉల్లిగడ్డల కోసం మహిళల తోపులాట... వీడియో ట్వీట్ చేసిన నారా లోకేశ్
- పెరిగిన ఉల్లి ధరలపై నారా లోకేశ్ స్పందన
- వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు
- చంద్రబాబు హయాంలో రాయితీపై అందించామని వెల్లడి
ఉల్లి ధరలు మండిపోతుండడంతో సామాన్యుడి ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు. మార్కెట్లో కొందామంటే కిలో ధర రూ.100 వరకు పలుకుతోంది. రాయితీపై రైతు బజార్లలో కొందామంటే తోపులాటలు, భారీ క్యూలలో అగచాట్లు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. దీనిపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ స్పందించారు. ఆఖరికి కిలో ఉల్లిపాయల కోసం ప్రజల ప్రాణాలు తీసే పరిస్థితికి వచ్చిందీ ప్రభుత్వం అంటూ మండిపడ్డారు. విజయనగరంలో ఉల్లిగడ్డల కోసం ప్రజలు ప్రమాదకర పరిస్థితుల్లో ఓ గేట్లోంచి తోసుకురావడాన్ని వీడియో రూపంలో ట్వీట్ చేశారు.
ఈ ఆరు నెలల జగన్ గారి పాలనలో ప్రజలు ఇసుక, ఉల్లి కోసం ధర్నాలు, ఉద్యమాలు చేయాల్సి వస్తోందని విమర్శించారు. చంద్రబాబు గారి పాలనలో ఉల్లి ధరలు పెరిగితే రేషన్ దుకాణాల ద్వారా సబ్సిడీపై ఉల్లిగడ్డలు సరఫరా చేశామని లోకేశ్ వెల్లడించారు. ఇప్పుడు 30 మంది సలహదారులను పెట్టుకుని కూడా ప్రజలను ఇలాంటి ఇబ్బందులకు గురిచేయడం మంచిదికాదు జగన్ గారూ అంటూ హితవు పలికారు.