Parliament: పార్లమెంటులో సబ్సిడీ ఫుడ్ కు ఇక ఎంపీలు దూరం.. స్పీకర్ సూచనకు ఏకగ్రీవ ఆమోదం
- బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో స్పీకర్ సూచనతో ఎంపీల ఏకగ్రీవ తీర్మానం
- సంవత్సరానికి 17 కోట్ల రూపాయల ప్రజాధనం మిగులు
- అధికారిక ప్రకటన రావడమే తరువాయి
ప్రజా ప్రయోజనాల కోసం, ప్రభుత్వ నిధుల రక్షణ కోసం చట్టాలు చేస్తూ.. ప్రజలను వాటికి బద్ధులుగా ఉండేలా చేయడంలో ఇటు అసెంబ్లీలది, అటు పార్లమెంట్ దీ కీలక పాత్ర అని మనకు తెలిసిందే. అయితే ఒక్కోసారి ప్రజలకు నీతులు చెప్పే నాయకులు కూడా తమ ప్రవర్తన ద్వారా విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలా కాలంగా మన పార్లమెంట్ సభ్యులు ఎదుర్కొంటున్న ఒక విమర్శపై లోక్ సభ స్పీకర్ నేతృత్వంలో యావత్ పార్లమెంట్ స్పందించి మన్ననలు అందుకుంటోంది.
విషయంలోకి వెళితే దేశరాజధాని ఢిల్లీలోని పార్లమెంట్ క్యాంటీన్లో చౌక ధరలకు పార్లమెంట్ సభ్యులకు ఆహార పదార్థాలు అందజేస్తున్నారు. ఓవైపు ప్రజల ఆర్థిక స్థితి దిగజారిపోతూ ఇబ్బందులు పడుతుంటే, లక్షలాది రూపాయల జీతాలు, ఇతర అలవెన్స్ లు తీసుకునే ఎంపీలకు సబ్సిడీ ధరలపై ఆహార పదార్థాలను అందించడం ఏమిటి అంటూ ప్రజల్లో చాలాకాలంగా అసంతృప్తి నెలకొని ఉంది.
ఇదే విషయమై గురువారం లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా నేతృత్వంలో జరిగిన లోక్ సభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో స్పీకర్ సూచనతో ఎంపీలు అందరూ తమకు లభిస్తున్న ఫుడ్ సబ్సిడీని వదులుకుంటున్నట్లు ఏకగ్రీవంగా తీర్మానించారట. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఎంపీలు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల సంవత్సరానికి 17 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు ఆదా అవుతాయి. ప్రస్తుతం పార్లమెంట్ క్యాంటీన్లో దోశ రూ. 12, కాఫీ రూ. 5, చపాతీ రూ. 2, రైస్ రూ. 7.. ఇలా ఇతర శాకాహార, మాంసాహార పదార్థాలు సైతం అతి చౌక ధరలకు దొరుకుతుండడం విశేషం.