YS Vivekananda Reddy: వివేకా హత్య జరిగిన రోజు ఎక్కడ ఉన్నారు? అని నన్ను ప్రశ్నించారు: సిట్ విచారణకు హాజరైన బీటెక్ రవి
- టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని ప్రశ్నించిన సిట్
- ఐదు గంటలపాటు విచారణ
- ఎప్పుడు పిలిచినా వస్తానన్న బీటెక్ రవి
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వైసీపీ మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. దీనిపై సిట్ విచారణ కొనసాగుతోంది. తాజాగా సిట్ అధికారులు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని విచారించారు. ఆయనను దాదాపు ఐదు గంటలపాటు ప్రశ్నించారు. దీనిపై బీటెక్ రవి మాట్లాడుతూ, సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పానని అన్నారు. తనవద్ద కేసుకు సంబంధించిన సమాచారం ఉందేమోనని సిట్ అధికారులు పిలిచారని, ఇటీవల ఆత్మహత్య చేసుకున్న శ్రీనివాసరెడ్డి ఘటనపైనా ఆరా తీశారని బీటెక్ రవి వివరించారు.
వివేకా హత్య జరిగిన రోజు ఎక్కడ ఉన్నారు? వివేకా హత్య సమాచారం ఎలా తెలిసింది? అంటూ ప్రశ్నించారని తెలిపారు. వివేకా కేసుకు సంబంధించి ఎప్పుడు పిలిచినా అన్నివిధాలుగా విచారణకు సహకరిస్తానని సిట్ అధికారులతో చెప్పినట్టు వెల్లడించారు. ఈ కేసులో దోషులను మాత్రమే పట్టుకోవాలని, నిర్దోషులు బలవ్వకుండా చూడాలని విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు.