sikh raides: గుజ్రాల్ మాట పీవీ వినకపోవడం వల్లే సిక్కు అల్లర్లు చెయ్యిదాటాయి: మాజీ ప్రధాని మన్మోహన్
- ఐకే గుజ్రాల్ చిలక్కి చెప్పినట్టు చెప్పారు
- కానీ అప్పటి హోం మంత్రి పీవీ పట్టించుకోలేదు
- గుజ్రాల్ శత జయంతి సందర్భంగా మన్మోహన్ సింగ్
సిక్కు అల్లర్లు జరిగి దాదాపు మూడున్నర దశాబ్దాల అనంతరం వాటిపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీని 1984లో ఆమె సెక్యూరిటీ గార్డులే కాల్చి చంపిన నేపథ్యంలో ఢిల్లీలో భారీగా సిక్కుల ఊచకోత జరిగింది. భారీగా అల్లర్లు చెలరేగాయి. ఆ పరిస్థితుల్లో సీనియర్ నాయకుడు ఐ.కె.గుజ్రాల్ చెప్పిన మాటలను నాడు హోంమంత్రిగా ఉన్న పి.వి.నరసింహారావు పెడచెవిన పెట్టడం వల్లే పరిస్థితి మరింత చేజారిందని మన్మోహన్ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో జరిగిన ఐ.కె.గుజ్రాల్ శత జయంతి సభలో మన్మోహన్ మాట్లాడారు.
తాను, గుజ్రాల్ ఒకే ఊరి వారమని, రాజకీయాల్లో చాలా ఏళ్లు కలిసి పనిచేశామని గుర్తు చేసుకున్నారు. అల్లర్లు జరిగిన సందర్భం తనకు ఇప్పటికీ గుర్తేనని చెప్పారు. 'ఆ రోజు గుజ్రాల్ పీవీ ఇంటికి వెళ్లారు. పరిస్థితులు చాలా ఉద్రిక్తంగా ఉన్నాయని, వెంటనే ఆర్మీని రంగంలోకి దించాలని సూచించారు.
కానీ పీవీ ఆయన సలహాను సానుకూలంగా తీసుకోలేదు. ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదు. నాడు గుజ్రాల్ సూచన పాటించి ఉంటే ఆరోజు అంతటి దురదృష్టకర పరిణామాలు జరిగి ఉండేవి కావు' అని గుర్తు చేశారు.