Rocket Booster: చేపల కోసం వల వేస్తే, పీఎస్ఎల్వీ రాకెట్ బూస్టర్ చిక్కింది!
- సముద్రంలో పడిన కార్టోశాట్ శాటిలైట్ రాకెట్ బూస్టర్
- పుదుచ్చేరి మత్స్యకారుల వలలో బూస్టర్
- శ్రీహరికోటకు చేర్చిన అధికారులు
సముద్రంలోకి వేట నిమిత్తం వెళ్లిన తమిళ జాలర్లకు పీఎస్ఎల్వీ రాకెట్ బూస్టర్ లభించింది. వివరాల్లోకి వెళితే, పుదుచ్చేరికి చెందిన కొందరు జాలర్లు సముద్రంలోకి చేపల కోసం వెళ్లారు. తీరానికి దాదాపు 10 నాటికల్ మైళ్ల దూరంలో వీరు వల వేయగా, రాకెట్ బూస్టర్ వలలో పడింది. దాదాపు 13 మీటర్ల పొడవు, మీటరు వెడల్పు ఉంది. దీని బరువు 16 టన్నుల వరకూ ఉండటంతో, నాలుగు పడవలకు కట్టి, దీన్ని ఒడ్డుకు చేర్చారు.
ఈ రాకెట్ బూస్టర్ పై ఎఫ్ఎల్ 119 అని, పీఎస్ఎంవో - ఎక్స్ ఎల్ అని, 23-2-2019 అని ఉంది. బూస్టర్ లభ్యమైన విషయాన్ని శ్రీహరికోట షార్ అధికారులకు తెలియజేయగా, నలుగురు అధికారులు పుదుచ్చేరికి చేరుకుని, 16 చక్రాల లారీని రప్పించి, దాని సాయంతో బూస్టర్ ను శ్రీహరికోటకు తరలించేయత్నం చేయగా, కొంత ఉద్రిక్త వాతావరణ పరిస్థితి ఏర్పడింది.
ఈ బూస్టర్ కారణంగా నాలుగు వలలు నాశనమయ్యాయని, 30 మంది జాలర్ల జీవనోపాధి పోయిందని, రూ. 20 లక్షల నష్టం కలిగిందని మత్స్యకారులు ఆరోపించారు. తమకు నష్టపరిహారం ఇచ్చిన తరువాతే దీన్ని తీసుకెళ్లాలని వారు పట్టుబట్టారు. మత్స్యకారులతో చర్చలు జరిపిన తరువాత, వారిని ఒప్పించిన అధికారులు రాకెట్ బూస్టర్ ను తరలించారు. ఇది నవంబర్ 27న ప్రయోగించిన కార్టోశాట్ ఉపగ్రహానికి సంబంధించినదని అధికారులు తెలిపారు.