Andhra Pradesh: ఒక్క దరఖాస్తూ రాలేదు... ఏపీలో కొత్త బార్లకు స్పందన నిల్!
- ఐదు రోజులైనా రాని దరఖాస్తులు
- రూ. 10 లక్షలు భారమంటున్న వ్యాపారులు
- కోర్టు తీర్పు వచ్చే వరకూ వేచి చూసే ధోరణి
ఆంధ్రప్రదేశ్ లో కొత్త బార్లకు వ్యాపారుల నుంచి ఏ మాత్రం స్పందన కనిపించడం లేదు. లైసెన్స్ లకు ఆహ్వానం పలుకుతూ నోటీసులు జారీ చేసి ఐదు రోజులు గడుస్తున్నా ఒక్కటంటే, ఒక్క దరఖాస్తు కూడా రాకపోవడం గమనార్హం. బార్ లైసెన్స్ కావాలంటే రూ. 10 లక్షలు కట్టాల్సివుండటం, లాటరీలో షాపు తగలకుంటే, కట్టిన డబ్బు వెనక్కు వచ్చే పరిస్థితి లేకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని అధికారులు అంటున్నారు.
ఇదే సమయంలో బార్ లను నడుపుతున్న పలువురు కోర్టును ఆశ్రయించడంతో, కోర్టు తీర్పు వచ్చేంత వరకూ ఆగాలని వ్యాపారులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. గడువుకు ముందే లైసెన్సులు రద్దు చేశారంటూ వ్యాపారులు కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. కోర్టులో కొత్త బార్లకు అనుకూలంగా తీర్పు రాకుంటే డబ్బులు వెనక్కి వస్తాయా? అన్న సందేహంలోనూ వ్యాపారులు ఉన్నారు. లైసెన్స్ కోసం రూ. 10 లక్షలు కట్టాల్సి రావడం తమపై భారమేనని అంటున్నారు. కోర్టులో స్పష్టత వచ్చిన తరువాతే ముందడుగు వేయాలని భావిస్తున్నారు.