Sidddipet: మగపిల్లలు ఏం చేస్తున్నారన్న విషయాలను తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలి: మంత్రి హరీశ్ రావు సూచన

  • అమ్మాయిలపై అఘాయిత్యాలు బాధాకరం
  • తల్లిదండ్రుల వైఖరిలో మార్పు రావాలి
  • ఆడపిల్లలపై కన్నా ఎక్కువగా మగపిల్లలపై దృష్టి పెట్టాలి

సిద్ధిపేటలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఉచిత అల్పాహార సేవా కార్యక్రమాన్ని మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అనంతరం, విద్యార్థులకు రక్తహీనత పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ, ఈ పాఠశాల అభివృద్ధి నిమిత్తం రూ.25 లక్షలు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. మరో రూ. 50 లక్షలు వచ్చే ఏడాది మంజూరు చేస్తామని చెప్పారు.

ఈ మూడు నెలల పాటు దించిన తల ఎత్తకుండా చదవాలని, జిల్లాలో ఈ పాఠశాల నెంబర్ వన్ గా వుండాలని కోరారు. రక్తహీనత పది శాతం కంటే తక్కువ వున్న విద్యార్థులను గుర్తించి వారికి మందులు అందజేస్తామని, ప్రతిఒక్కరూ తినే ఆహారంలో కొద్దిగా మార్పులు చేసుకోవాలని, ప్రతిఒక్కరూ యోగా నేర్చుకుని వారి తల్లిదండ్రులకు కూడా నేర్పించాలని సూచించారు.

అమ్మాయిలపై అఘాయిత్యాలు బాధాకరమని, దిశపై అఘాయిత్యం ఘటన ఆవేదనకు గురిచేసిందని హరీశ్ రావు అన్నారు. అమ్మాయిలు తమను తాము రక్షించుకునే విధంగా నెలలో ఒకసారి శిక్షణ ఇవ్వాలని అన్నారు. తల్లిదండ్రుల వైఖరిలో మార్పు రావాలని, మగపిల్లలకు విద్యతో పాటు విలువ, సంస్కారంతో కూడిన విద్యనందించాలని అన్నారు. ఆడపిల్లలపై కన్నా ఎక్కువగా మగపిల్లలపై దృష్టి పెట్టాలని, వాళ్లు ఏం చేస్తున్నారన్న విషయాలను గమనిస్తూ వుండాలని తల్లిదండ్రులకు సూచించారు.

  • Loading...

More Telugu News