Chinese Vessel: భారత జలాల్లో అనుమానాస్పద చైనా నౌక... వెంటపడి తరిమేసిన భారత నేవీ!
- పోర్ట్ బ్లెయిర్ సమీపంలో ఘటన
- నిఘా నిమిత్తం వచ్చిన 'షీ యాన్ 1'
- గుర్తించిన భారత నిఘా విమానాలు
అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లెయిర్ సమీపంలోని భారత ప్రాదేశిక జలాల్లోకి వచ్చిన అనుమానిత చైనా నౌకను భారత నేవీ తరిమికొట్టింది. ఈ విషయాన్ని నేడు భారత నేవీ డే సందర్భంగా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇటీవల చైనాకు చెందిన రీసెర్చ్ వెజెల్ 'షీ యాన్ 1' భారత జలాల్లోకి వచ్చిందని, దీన్ని గుర్తించిన నిఘా విమానాలు సముద్రంలో ఉన్న తేలికపాటి యుద్ధ నౌకలకు సమాచారాన్ని అందించగా, అవి దాని వెంట నడిచి, తక్షణం భారత జలాలను వదిలి వెళ్లాలని హెచ్చరించాయి.
పేరుకు మాత్రమే అది రీసెర్చ్ నౌకని, కానీ చేస్తున్నది మాత్రం గూఢచర్యమని నేవీ వర్గాలు వెల్లడించాయి. సముద్రంలో భారత కార్యకలాపాలపై నిఘా పెట్టేందుకే అది వచ్చిందని, ఈ తరహా చర్యలను భారత్ అడ్డుకుని తీరుతుందని అన్నారు. నిజంగా అది రీసెర్చ్ కోసం వస్తే, భారత అధికారుల నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరని, ఈ విషయం చైనాకు తెలుసునని ఓ అధికారి వ్యాఖ్యానించారు.