Jagan: ఏప్రిల్ నుంచి ఏపీలో నాణ్యమైన ప్యాకేజ్డ్ బియ్యం పంపిణీ!
- పౌరసరఫరాల శాఖపై సీఎం జగన్ సమీక్ష
- హాజరైన మంత్రి కొడాలి నాని, ఉన్నతాధికారులు
- బియ్యం పంపిణీ సన్నద్ధతపై అధికారులతో చర్చించిన సీఎం
రాష్ట్ర పౌరసరఫరాల శాఖపై ఏపీ సీఎం జగన్ నిర్వహించిన సమీక్ష సమావేశం ముగిసింది. ఈ సమీక్షలో సీఎంతో పాటు మంత్రి కొడాలి నాని, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా, నాణ్యమైన బియ్యం లబ్దిదారుల ఇళ్ల వద్దకే అందించడంపై సీఎం జగన్ సమీక్షించారు. దాంతో శ్రీకాకుళంలో అమలవుతున్న పైలెట్ ప్రాజెక్టు వివరాలను అధికారులు సీఎంకు తెలిపారు. బియ్యంపై ప్రజల నుంచి వస్తున్న స్పందన బాగుందని అధికారులు ఆయనకు వివరించారు.
ఈ క్రమంలో ఏప్రిల్ నుంచి అన్ని జిల్లాలో నాణ్యమైన ప్యాకేజ్డ్ బియ్యం అందించేందుకు సీఎం జగన్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. బియ్యం పంపిణీ సన్నాహాలపై సీఎంకు అధికారులు వివరాలు తెలియజేశారు. బియ్యం సేకరణ, ప్యాకేజింగ్ యూనిట్లు, గోడౌన్లలో నిల్వ తదితర అంశాలపై సీఎం జగన్ అధికారులతో చర్చించారు. ఎక్కడా అలసత్వం లేకుండా చర్యలు తీసుకోవాలని, ప్రతి లబ్దిదారుడికి నాణ్యమైన బియ్యం అందించాలని స్పష్టం చేశారు. ప్రతి దశలోనూ బియ్యం నాణ్యత పరిశీలించే వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. బియ్యం ఇచ్చే ప్లాస్టిక్ బ్యాగులను తిరిగిచ్చేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.