Disa: దిశ కేసులో మరో నిందితుడు ఉన్నాడని సోషల్ మీడియాలో పోస్ట్... పరుగులు పెట్టిన పోలీసులు!
- చిన్నపొర్లలో మరో నిందితుడంటూ పోస్ట్
- వెళ్లి విచారణ చేపట్టిన పోలీసులు
- ఐదో నిందితుడు లేడని స్పష్టీకరణ
దిశ హత్యాచారం కేసులో ఐదో నిందితుడు ఉట్కూర్ మండలంలోని చిన్నపొర్ల గ్రామంలో ఉన్నాడంటూ, వాట్స్ యాప్ గ్రూపుల్లో ఓ పోస్ట్ వైరల్ కావడంతో పోలీసులు ఉరుకులు, పరుగులు పెట్టారు. ఈ కేసులో గుడిగండ్ల, జుక్లేర్ గ్రామాలకు చెందిన మహ్మద్ పాషా, నవీన్ కుమార్, చెన్నకేశవులు, శివలను నిందితులుగా గుర్తించిన పోలీసులు, వారిని కోర్టులో హాజరుపరిచి, కట్టుదిట్టమైన భద్రత మధ్య చర్లపల్లి జైలుకు తరలించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో చిన్నపొర్లలో మరో యువకుడు ఉన్నాడని, అతను దిశను రేప్ చేసి చంపిన ఐదో నిందితుడని ఓ వదంతి వ్యాపించింది. ఇవి పోలీసుల దృష్టికి వెళ్లడంతో హుటాహుటిన ఆ గ్రామానికి వెళ్లిన ఎస్ఐ బృందం, గ్రామస్తుల వద్ద వివరాలు అడిగి తెలుసుకుంది. దిశ కేసులో నిందితుడిగా ఉన్న గుడిగండ్ల నవీన్ కుమార్ కు చిన్నపొర్లలో బంధువులు ఉన్నారని, కొంతకాలం ఇక్కడే చదువుకున్నాడని తేల్చారు. అంతేతప్ప ఐదో నిందితుడు లేడని స్పష్టం చేశారు.