Telangana: నరేంద్ర మోదీజీ! ఐపీసీ, సీఆర్పీసీ చట్టాల్లో సవరణలు తేవాలి: మంత్రి కేటీఆర్
- అత్యాచారం చేసిన వాళ్లకు ఉరిశిక్షే విధించాలి
- ఆ శిక్షపై మళ్లీ సమీక్షకు వెళ్లే అవకాశం ఉండకూడదు
- పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశం లేవనెత్తాలని విజ్ఞప్తి
వెటర్నరీ డాక్టరు అత్యాచారం, హత్య ఘటనపై మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. చట్టాల్లో మార్పు తీసుకురావాలని కోరుతూ ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి వరుస ట్వీట్లు చేశారు. ఐపీసీ, సీఆర్పీసీ చట్టాల్లో మార్పులు తేవాలని, అత్యాచారం చేసిన వాళ్లకు ఉరిశిక్షే విధించాలని, ఆ శిక్షపై మళ్లీ సమీక్షకు వెళ్లే అవకాశం ఉండకూడదని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా నిర్భయపై అత్యాచార ఘటన గురించి ప్రస్తావించారు. ఈ ఘటన జరిగి ఏడేళ్లయినా నిందితులకు ఉరిశిక్ష పడలేదని అన్నారు.ఇటీవల తొమ్మిది నెలల పాపపై అత్యాచారానికి పాల్పడ్డ దోషికి ఉరిశిక్ష విధించాలని దిగువ కోర్టు తీర్పిస్తే, ఆ శిక్షను హైకోర్టు తగ్గిస్తూ జీవితఖైదుగా మార్చిన విషయాన్ని ప్రస్తావించారు.
ఇప్పుడు హైదరాబాద్ లో ఓ వెటర్నరీ డాక్టర్ ను అత్యాచారం చేసి, హత్య చేశారని, హంతకులు దొరికారు కానీ, బాధితురాలికి న్యాయం ఎలా చేద్దామని ప్రశ్నించారు. న్యాయం జరగడంలో ఆలస్యమైందంటే న్యాయం జరగనట్టే అని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కనుక, ఈ అంశాన్ని లేవనెత్తి దీనిపై ఓ రోజు మొత్తం చర్చించి, ఐపీసీ, సీఆర్పీసీలో సవరణలు తీసుకురావాలని కోరారు. బాధపడుతున్న, నిస్సహాయంగా వున్న పౌరుల తరపున విజ్ఞప్తి చేస్తున్నానంటూ మోదీకి చేసిన ట్వీట్లలో కేటీఆర్ పేర్కొన్నారు.