Tamilnadu: ఫేస్ బుక్ లో ప్రేమ... పెళ్లికి అంగీకరించ లేదని, మలేషియా నుంచి వచ్చి ప్రియుడి హత్యకు ప్లాన్!
- పలు పేర్లతో మోసం చేసిన విఘ్నేశ్వరి
- పోలీసులు హెచ్చరించినా మారని వైఖరి
- విఘ్నేశ్వరి కోసం గాలిస్తున్న తమిళనాడు పోలీసులు
తనకు ఫేస్ బుక్ లో పరిచయమై, ప్రేమించానని చెప్పి, ఆపై వివాహం చేసుకునేందుకు నిరాకరించిన ప్రియుడిని మట్టు బెట్టేందుకు మలేషియా నుంచి వచ్చి, 9 మందికి సుపారీ ఇచ్చిన యువతి కోసం తమిళనాడు పోలీసులు గాలిస్తున్నారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, మలేషియాలో ఉండే అముదేశ్వరి అలియాస్ కవితా అరుణాచలం అనే యువతికి తేని జిల్లాకు చెందిన అశోక్ కుమార్ (24) అనే ప్రైవేటు ఉద్యోగి పరిచయం అయ్యాడు. ఫేస్ బుక్ లో మొదలైన వీరి స్నేహం, ప్రేమగా మారగా పెళ్లి చేసుకోవాలని భావించారు.
ఆపై ఇద్దరి మధ్యా భేదాభిప్రాయాలు వచ్చి విడిపోయారు. ఈ క్రమంలో మలేషియా నుంచి పేరు మార్చుకుని అశోక్ కు ఫోన్ చేసిన అముదేశ్వరి, "నువ్వు వివాహం చేసుకోకపోవడం వల్ల ఆమె చనిపోయింది" అని చెప్పింది. దీన్ని నమ్మిన అశోక్ దిగ్భ్రాంతికి గురయ్యాడు. ఆపై మలేషియా నుంచి వచ్చిన ఆమె, అశోక్ ను కలిసింది. తనను పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేసింది. దీనిపై అశోక్ పోలీసులను ఆశ్రయించగా, పోలీసులు ఆమెను విచారించారు. ఆమె పలు పేర్లను పెట్టుకుందని, అసలు పేరు విఘ్నేశ్వరి అని గుర్తించారు,. కౌన్సెలింగ్ నిర్వహించి, హెచ్చరించి పంపారు.
ఆపై అశోక్ తనను మోసం చేశాడని పగ పెంచుకున్న ఆమె, 9 మంది కూలీలను కలుపుకుని సుపారీ ఇచ్చి, ప్రియుడిని చంపడానికి ప్లాన్ వేసింది. వీరంతా మొన్న శుక్రవారం నాడు ఓ ప్రైవేటు లాడ్జీలో ఉండగా, లాడ్జి యాజమాన్యానికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా, మొత్తం విషయం బయటపడింది. వారి నుంచి కారు, కత్తి, ఇతర ఆయుధాలను, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు, అసలు నిందితురాలి కోసం గాలిస్తున్నారు.