Crime News: 'ప్రియాంక రెడ్డి' కేసు నిందితులను తమకు అప్పగించాలంటూ ఆందోళన.. షాద్ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
- వారికి బతికే హక్కు లేదంటోన్న స్థానికులు
- పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తోపులాట
- కాసేపట్లో నిందితులను కోర్టుకు తరలించనున్న పోలీసులు.. భారీ భద్రత
దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ప్రియాంక రెడ్డి హత్యాచారం కేసులో మరిన్ని వివరాలు రాబట్టేందుకు నిందితులను కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసులు కోర్టు అనుమతి కోరే అవకాశమున్నట్లు తెలుస్తోంది. నిందితులను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి కూడా తరలించనున్నారు.
నిందితులను షాద్‌నగర్ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ప్రియాంకపై నలుగురు కాకుండా ఐదుగురు దుండగులు అత్యాచారానికి పాల్పడి, హత్య చేశారని పోలీసులు భావిస్తున్నారు. మరొకడి కోసం పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు.
'ప్రియాంక రెడ్డి' ఘటనతో షాద్‌నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీస్ స్టేషన్ గేట్ వద్దకు ప్రజా సంఘాల నాయకులు, విద్యార్థులు దూసుకెళ్లారు. దీంతో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. అనంతరం ఆందోళనకారులు రహదారిపై బైఠాయించారు. నిందితులను తమకు అప్పగించాలంటూ వారు నినాదాలు చేస్తున్నారు. ఇటువంటి మృగాళ్లకు జీవించే హక్కు లేదంటూ వాదిస్తున్నారు. పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. వాహనాల రాకపోకలకు ఆటంకాలు ఎదురుకాకుండా దారి మళ్లిస్తున్నారు.