Telugudesam: ఇదేనా వైసీపీ సంస్కృతి?: టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు

  • రైతులు, రియల్టర్లు దాడి చేశారని వైసీపీ నాయకులు చెబుతుండటం సిగ్గుచేటు
  • మాజీ  సీఎంకే రక్షణ కల్పించలేని విధంగా పోలీస్ వ్యవస్థ
  • బాబు ప్రయాణిస్తున్న బస్సుపై దాడి ఘటనపై ఖండన

చంద్రబాబు ప్రయాణిస్తున్న బస్సుపై దాడి ఘటనకు కారణం వైసీపీ గూండాలేనని టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. అనంతపురంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రైతులు, రియల్టర్లు దాడి చేశారని వైసీపీ నాయకులు చెబుతుండటం సిగ్గుచేటని, రాష్ట్రంలో ఓ మాజీ ముఖ్యమంత్రికే రక్షణ కల్పించలేని విధంగా పోలీస్ వ్యవస్థ తయారైందని ధ్వజమెత్తారు.

 చంద్రబాబు పర్యటనపై నిరసన తెలిపేందుకు తామే అనుమతిచ్చామని డీజీపీ గౌతం సవాంగ్ చెప్పడంపై విమర్శలు గుప్పించారు. ఈ దాడిని కూడా ఆయన సమర్థిస్తున్నారని ఆరోపించారు. నిన్న చంద్రబాబు పర్యటన ప్రారంభించినప్పటి నుంచి మంత్రులందరూ మీడియాలో అసభ్యకరంగా మాట్లాడుతూ మీడియా సమావేశాలు నిర్వహించారని, ఇదేనా వైసీపీ సంస్కృతి? అని ప్రశ్నించారు. గతంలో పీవీ నర్సింహారావు, ఎన్టీఆర్ లు పర్యటన సందర్భంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇలాంటి దాడులే చేయించారని, ఇప్పుడు అదే సంస్కృతిని సీఎం జగన్ అనుసరిస్తున్నారని, ఈ దాడి ఘటనను ఖండిస్తున్నానని అన్నారు.

Telugudesam
Kalva Srinivasulu
YSRCP
jagan
  • Loading...

More Telugu News