Road Accident: డివైడర్ను ఢీకొట్టిన బస్సు...అయ్యప్ప భక్తుడి మృతి.. 15 మందికి తీవ్రగాయాలు
- తమిళనాడులోని కంచిలో ప్రమాదం
- బాధితులు విజయనగరం జిల్లావాసులు
- శబరిమలకు వెళ్లి వస్తుండగా ఘటన
అయ్యప్ప దీక్షాధారులతో శబరిమల యాత్రకు వెళ్లి తిరిగి బయలుదేరిన బస్సు డివైడర్ను ఢీకొట్టిన ప్రమాదంలో ఒక భక్తుడు మృతి చెందగా మరో 15 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. తమిళనాడు రాష్ట్రం కంచిలో ఈ రోజు తెల్లవారు జామున జరిగిన ఈ ఘటనకు సంబంధించి బాధితుల కథనం మేరకు వివరాలు ఇలావున్నాయి.
విజయనగరం జిల్లా పాచిపెంట మండలానికి చెందిన కొందరు అయ్యప్ప భక్తులు ప్రైవేటు ట్రావెల్ బస్సును బుక్ చేసుకుని కేరళ రాష్ట్రంలోని శబరిమల యాత్రకు వెళ్లారు. దీక్ష ముగించి స్వామి దర్శనానంతరం తిరుగు ప్రయాణమయ్యారు. బస్సు కంచి సమీపంలోకి వచ్చేసరికి రోడ్డు పక్కన ఉన్న డివైడర్ను ఢీకొట్టింది. ఆ సమయానికి బస్సు అతివేగంగా వస్తుండడంతో ఘటనా స్థలిలోనే ఒకరు మృతి చెందగా మరో 15 మంది గాయపడ్డారు.
మృతుడిని పాచిపెంట మండలం పాంచాలి గ్రామానికి చెందిన గౌరీశ్వరరావు (25)గా గుర్తించారు. మిగిలిన వారిని కూడా అదే గ్రామానికి చెందిన వారిగా భావిస్తున్నారు. డ్రైవర్ నిద్రమత్తులో బస్సు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు.