selfi vedio: గ్రామ సచివాలయాలతో మా బతుకులు రోడ్డున పడ్డాయి: మరణ వాంగ్మూలం అంటూ పంచాయతీ అటెండర్ సెల్ఫీ వీడియో
- ఏపీ సీఎం, కలెక్టర్ పేరుతో పోస్టింగ్
- అనంతరం కనిపించకుండా పోయిన ఉద్యోగి
- పిఠాపురం మండలం బి.పత్తిపాడులో విధులు
ఓ పంచాయతీ అటెండర్ సంచలనానికి తెరలేపాడు. ఏపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన గ్రామ సచివాలయం వ్యవస్థవల్ల ప్రయోజనాలమాట దేవుడెరుగుగాని, ప్రస్తుతం ఎప్పటి నుంచో పనిచేస్తున్న తమ ఉద్యోగాలకు భద్రత లేకుండా పోయిందని వాపోయాడు. ఈ మేరకు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి, జిల్లా కలెక్టర్లను ఉద్దేశించి మాట్లాడుతున్న సెల్ఫీ వీడియోను యూట్యూబ్ లో పోస్టు చేశాడు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం బి.పత్తిపాడు పంచాయతీలో అటెండరుగా పనిచేస్తున్న ముత్తేశ్వరరావు అనే వ్యక్తి పెట్టిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో సంచలనం రేపుతోంది.
'అయ్యా ముఖ్యమంత్రిగారు... నేను 2014 నుంచి అటెండర్‌గా పనిచేస్తున్నాను. అప్పటి నుంచి ప్రజావసరాల నిమిత్తం స్థానికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పంచాయతీలో వాటర్ ట్యాంక్, బోరు బావి, వీధి దీపాల మరమ్మతులు, అధిక వడ్డీలకు అప్పుతెచ్చి పనులు చేయిస్తూ వస్తున్నాను. ఇప్పుడీ సచివాలయ వ్యవస్థతో అవమానాల పాలవుతున్నాం. మాగోడు స్పందనలో వినిపించుకున్నా పట్టించుకున్న వారు లేరు.
మా ఉద్యోగాలు ఉంటాయో, ఊడుతాయో తెలియక ఆందోళన చెందుతున్నాం. మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని వేడుకుంటున్నాను. అలాగే నిత్యం నన్ను అవమానిస్తున్న కార్యదర్శి తీరుతో తీవ్ర మనస్తాపానికి గురవుతున్నాను. అందుకే జీవితాన్ని ముగించాలని ఈ సెల్ఫీ వీడియో పంపిస్తున్నాను' అంటూ వీడియోలో పేర్కొన్నాడు. తమ ఉద్యోగాలకు భద్రత కల్పిస్తూ జీవో విడుదల చేయాలని కోరాడు.