Telangana: మేం ఓడిపోలేదు..ప్రభుత్వం గెలవలేదు!: ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి

  • రేపటి నుంచి కార్మికులు విధుల్లో చేరతారు
  • సీఎం ప్రకటనను స్వాగతిస్తున్నాం
  • సమ్మె కారణంగా ఇబ్బంది పడ్డ ప్రజలు క్షమించాలి

తెలంగాణలో ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వం చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నామని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. ఈ రోజు కేబినెట్ భేటీ అనంతరం సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికులు రేపటి నుంచి విధుల్లో చేరడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో అశ్వత్థామ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రేపు కార్మికులందరూ విధుల్లో చేరతారన్నారు. సీఎం ప్రకటనపై తమకెలాంటి అభ్యంతరం లేదన్నారు. జేఏసీ తరపున సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు. యూనియన్లకు నాయకత్వం వహించాలన్న కోరికలు తమకు లేవన్నారు. సమస్యలు పరిష్కరిస్తామంటే స్వాగతిస్తామని చెప్పారు.

రెండు మూడు రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. సమ్మె కారణంగా ఇబ్బంది పడ్డ ప్రజలకు క్షమాపణ చెబుతున్నామన్నారు. సమ్మెతో తమ కష్టాలను ప్రజలు పెద్ద మనసుతో అర్థం చేసుకున్నారని, ప్రభుత్వం కూడా దీనికి బాధ్యత వహించాలని అన్నారు. ప్రభుత్వం ముందే చర్చలకు పిలిచి మాట్లాడవలసిందని ఆయన అభిప్రాయపడ్డారు. చివరిగా ఆయన 'మేం ఓడి పోలేదు.. ప్రభుత్వం గెలవలేదు' అని చెప్పారు.

  • Loading...

More Telugu News