Thammineni Seetharam: ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేసిన సుంకర పద్మశ్రీ
- తమ్మినేని స్పీకరా? లేక బ్రోకరా?
- ఆయన భాషను ప్రజలు అసహ్యించుకుంటున్నారు
- వైసీపీ నేతలకు దేవుడంటే భయం కూడా లేదు
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన స్పీకర్ తమ్మినేని సీతారాంపై విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావుకు ఏపీసీసీ ఉపాధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో ఆమె మాట్లాడుతూ తమ్మినేనిని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమ్మినేని స్పీకరా? లేక బ్రోకరా? అని ప్రశ్నించారు. బాధ్యతాయుతమైన స్పీకర్ పదవిలో ఉండి, నోటికొచ్చినట్టు మాట్లాడటం ఏమిటని ప్రశ్నించారు. స్పీకర్ భాషను ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు. తమ్మినేనిని స్పీకర్ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి జగన్ కుటుంబసభ్యులు ఎప్పుడూ బైబిల్ పట్టుకునే ఉంటారని... అలాంటప్పుడు తిరుమల ఆలయంలోకి వెళ్లే సమయంలో జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని పద్మశ్రీ చెప్పారు. తిరుమలలో డిక్లరేషన్ ఇస్తే కొత్త ఇబ్బందులు వస్తాయనే ఆలోచనతోనే డిక్లరేషన్ ఇవ్వడం లేదని అన్నారు. వైసీపీ నేతలకు దేవుడంటే భయం కూడా లేదని... అందుకే నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.