Janasena: అవకాశవాద రాజకీయాలకు ‘జనసేన’ దూరం: పవన్ కల్యాణ్

  • సంప్రదాయ, సంకుచిత రాజకీయాలను పక్కనబెట్టాలి
  • భావి తరాలకు మేలు చేసేలా చేయాలి
  • తెలుగు మాధ్యమం లేకపోవడం సమంజసమా?

ఓట్లు పడతాయా లేదా అనే ఆలోచనతో కాకుండా ప్రజలకు మేలు కలుగుతుందా లేదా అనే యోచనతో రాజకీయాలు చేయాల్సిన అవసరం ఉందని తమ నేతలకు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పిలుపు నిచ్చారు. హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో ఇవాళ జరిగిన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం (పీఏసీ)లో ఆయన అధ్యక్షోపన్యాసం చేశారు.

పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, అవకాశవాద రాజకీయాలకు జనసేన దూరంగా వుంటుందని, పార్టీ భావజాలానికి అనుగుణంగా పని చేయడమే లక్ష్యమని స్పష్టం చేశారు. విశాఖపట్నంలో ఈ నెల 3న జరిగిన లాంగ్ మార్చ్ అపూర్వ విజయానికి పార్టీ ఆలోచన విధానమే కారణమని అన్నారు. ఆంధ్ర ప్రదేశ్, దేశంలోని ఇతర ప్రాంతాల్లో కొత్త తరం, పాతతరం మధ్యన అంతరాలు ఉన్నాయని, భావి తరాల దృష్ట్యా నిర్ణయాలు తీసుకోకపోతే అన్యాయం చేసిన వాళ్ళమవుతామని అన్నారు. సంప్రదాయ, సంకుచిత రాజకీయాలను పక్కన పెడదామని పిలుపు నిచ్చారు.
 
తాను బహిరంగంగా ఏది మాట్లాడినా ఒకటికి పదిసార్లు ఆలోచిస్తానని, ఇలా మాట్లాడితే ఒక వర్గానికి కోపం వస్తుందని, వేరేలా మాట్లాడితే ఇంకో వర్గానికి కోపం వస్తుందని భావించి తన పంథాను మార్చుకోనని స్పష్టం చేశారు. భావితరాల మేలు కోసం ఏమి చేస్తే మంచిదో అదే మాట్లాడతానని, మనం ఏం మాట్లాడినా రాజ్యాంగబద్ధంగా, రాజ్యాంగ పరిధిలోనే మాట్లాడదామని అన్నారు.

తెలుగును ప్రాథమిక స్థాయిలోనే బోధన భాషగా స్థానం లేకుండా చేయడం ఎంతవరకు సమంజసమని, భాషను వదిలేస్తే సంస్కృతి నశించి, సంస్కృతీ మూలాలు అంతరించిపోతాయని అన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉత్తర్వులు సైతం వారి వారి భాషల్లోనే వెలువడుతున్న ఈ రోజుల్లో మన తెలుగు పాఠశాలల్లో తెలుగు మాధ్యమం లేకపోవడం ఎంత వరకు సమంజసమని చెప్పారు.

నది ఉన్నచోట నాగరికత ఉంటుంది. భాష ఉన్నచోట నాగరికత పరిఢవిల్లుతుంది. అందువల్ల ‘మన నుడి - మన నది’ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని, ఇది నిరంతరాయంగా సాగే పోరాటమని అన్నారు. ఇసుక సరఫరా సక్రమంగా, సజావుగా సాగే వరకు జనసైనికులు ఒక కంట కనిపెట్టి ఉండాలని, ఇసుక సరఫరాలో అక్రమాలు చోటుచేసుకుంటే పార్టీ దృష్టికి తీసుకురావాలని అన్నారు.

 రాయలసీమలో ‘జనసేన’కు అపారమైన క్యాడర్  

త్వరలోనే రాయలసీమ ప్రాంతంలో పర్యటిస్తానని పవన్ కల్యాణ్ వెల్లడించారు. ఈ పర్యటనకు సంబంధించిన కార్యక్రమాన్ని పార్టీ ప్రతినిధులు రూపకల్పన చేస్తున్నారని అన్నారు. రాయలసీమలో జనసేనకు అపారమైన క్యాడర్ ఉందని, క్యాడర్ ను సమష్టిగా ఉంచి వారిని ముందుకు నడిపే నాయకత్వాన్ని సిద్ధం చేద్దామని చెప్పారు. నిలకడగా పనిచేసే వారిని రాయలసీమలో గుర్తించాలని, కార్యకర్తలను రక్షించుకోవాల్సిన పరిస్థితి పలుచోట్ల ఉందని, వారికి అండగా నిలుద్దామని అన్నారు. డిసెంబర్ 15వ తేదీలోగా పార్టీ మండల, పట్టణ కమిటీల నియామకాలను పూర్తి చేయాలని ఈ సందర్భంగా పీఏసీ సభ్యులకు పవన్ ఆదేశించారు.

Janasena
Pawan Kalyan
Hyderabad
PAC
  • Loading...

More Telugu News