Maharashtra: ‘మహా’ పరిణామాలతో దిగ్భ్రాంతి.. సెలవు కోసం కాలేజీకి లేఖ రాసిన అధ్యాపకుడు!
- క్షణక్షణం ఉత్కంఠ రేపుతున్న మహారాష్ట్ర రాజకీయ పరిణామాలు
- తన వల్ల కాదంటూ కళాశాలకు లేఖ రాసిన ఇంగ్లిష్ లెక్చరర్
- సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న లీవ్ లెటర్
మహారాష్ట్రలో క్షణక్షణం ఉత్కంఠ రేపుతున్న రాజకీయ పరిణామాలతో కలత చెందిన ఓ ఇంగ్లిష్ అధ్యాపకుడు తన మనసేమీ బాగోలేదని, సెలవు కావాలంటూ కళాశాలకు లీవ్ లెటర్ పంపించాడు. ఇప్పుడా లేఖ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా గండ్‌చందూర్‌లోని ఓ కళాశాలలో జహీర్ ఇంగ్లిష్ లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు.
మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసి ఫలితాలు వచ్చిన తర్వాతి రోజు నుంచి రాజకీయ పరిణామాలు వేగంగా మారుతూ వచ్చాయి. బీజేపీ-శివసేన మధ్య విభేదాల కారణంగా ఆ రెండు పార్టీలు దూరమయ్యాయి. దీంతో ఎవరికీ పూర్తిస్థాయిలో మెజారిటీ లేకపోవడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయారు. దీంతో తప్పని పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన విధించారు.
ఇక, శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు ఎవరూ ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. త్వరలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందన్న వార్తల నేపథ్యంలో, అనూహ్యంగా దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాత్రి వరకు శివసేనతో ఉన్న ఎన్సీపీ నేత అజిత్ పవార్ ఉదయం బీజేపీతో కలిసి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
దీంతో ఏం జరుగుతోందో అర్థంకాని లెక్చరర్ జహీర్ .. ఈ పరిణామాలు తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయని, తనకు సెలవు కావాలని పేర్కొంటూ కళాశాలకు లేఖ రాశారు. ఇప్పుడీ లేఖ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.