shivsena: మహారాష్ట్ర అంశంపై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభం.. బీజేపీ వెంటనే బలపరీక్ష ఎదుర్కోవాలని కోరిన కపిల్ సిబాల్
- బీజేపీకి మెజార్టీ ఉంటే వెంటనే నిరూపించుకోవాలి
- లేదంటే శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కు అవకాశం ఇవ్వాలి
- ఈ కూటమికి 144 మంది ఎమ్మెల్యేల మద్దతు
మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు అంశంపై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. మహారాష్ట్రలో బీజేపీ తమ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టే అవకాశం లేకుండా ఈ రోజే బలపరీక్షకు అవకాశం ఇవ్వాలని శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై జస్టిస్ ఎన్వీ రమణ, అశోక్ భూషణ్, సంజీవ్ ఖన్నాతో కూడిన ధర్మాసనం విచారణ జరుపుతోంది.
కాంగ్రెస్, శివసేన తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ వాదనలు వినిపిస్తున్నారు. బీజేపీ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తున్నారు. బీజేపీకి ప్రభుత్వ ఏర్పాటు చేసే బలముంటే వెంటనే బలపరీక్ష ఎదుర్కోవాలని కపిల్ సిబాల్ అన్నారు.
వారికి మెజార్టీ ఉంటే వెంటనే నిరూపించుకోవాలని ఆదేశాలివ్వాలని కపిల్ సిబాల్ కోరారు. లేదంటే శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కు ప్రభుత్వ ఏర్పాటు కోసం అవకాశం ఇవ్వాలని అన్నారు. ఈ కూటమికి 144 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్పారు.
గవర్నర్ కు ఎవరో రాజకీయ నేత నేరుగా ఆదేశాలు ఇస్తున్నారని, ఆ ప్రకారమే గవర్నర్ నిర్ణయాలు తీసుకుంటున్నారని, లేదంటే ఇటువంటి పరిణామాలు చోటు చేసుకోవని చెప్పారు. రాష్ట్రపతి పాలన ఎత్తేయాలని రాత్రికి రాత్రే ఆయన ఎలా సిఫార్సు చేయగలరని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్ నుంచి కనీసం లేఖ కూడా రాలేదన్నారు.