Chandrababu: ప్రజల్లో వ్యతిరేకత రావడంతో వైసీపీ తోకముడిచింది: చంద్రబాబు
- ప్రతిభా అవార్డులకు వైఎస్సార్ పేరుపెట్టాలనుకున్నారని ఆరోపణ
- ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని పిలుపు
- ఇంగ్లీషు మీడియంపైనా వ్యాఖ్యలు
అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారాల పేరును వైఎస్సార్ ప్రతిభా పురస్కారాలుగా మార్చేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నించిందని, అయితే ప్రజల్లో వ్యతిరేకత రావడంతో తోకముడిచిందని విమర్శించారు. వైసీపీ నేతల రెండు నాల్కల ధోరణిని ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అంతేగాకుండా, రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిన ఇంగ్లీషు మీడియం వ్యవహారంపైనా చంద్రబాబు స్పందించారు.
తెలుగు మీడియం కొనసాగిస్తూనే ఇంగ్లీషు బోధన ప్రవేశపెట్టాలని సూచించారు. మాతృభాష తెలుగును కాపాడాలన్నదే టీడీపీ విధానమని ఉద్ఘాటించారు. మన భాష, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు తెలుగు భాష ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు. అయితే వృత్తిలో రాణించేందుకు ఇంగ్లీషు అవసరమని చెప్పిన ఆయన, ఇంగ్లీషు మీడియం బోధనకు టీడీపీ వ్యతిరేకమనే దుష్ప్రచారం తగదని అన్నారు. తమ హయాంలో తెలుగుకు ప్రాధాన్యం ఇస్తూనే ఆంగ్ల మాధ్యమానికి కృషి చేశామని తెలిపారు.