Jagan: జగన్ మూర్ఖత్వం కారణంగా అన్ని ప్రయత్నాలు బూడిదలో పోసిన పన్నీరవుతున్నాయి: చంద్రబాబు
- జగన్ పై చంద్రబాబు వ్యాఖ్యలు
- అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శలు
- లులూ గ్రూప్ వెనక్కి మరలడంపై ట్విట్టర్ లో స్పందన
రాష్ట్రానికి పెట్టుబడిదారులు రావాలంటేనే భయపడే వాతావరణం నెలకొందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. రాష్ట్రాభివృద్ధి కోసం చేసిన ప్రయత్నాలన్నీ జగన్ మూర్ఖత్వం కారణంగా బూడిదలో పోసిన పన్నీరు చందాన వృథా అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలు పెట్టుబడిదారులకు వ్యతిరేక వాతావరణాన్ని సృష్టిస్తున్నాయని, ఏపీ యువత భవిష్యత్తును అంధకారంలోకి నెడుతున్నాయని విమర్శించారు.
ఏపీ ప్రజల తరఫున లులూ గ్రూప్ కు సానుభూతి తెలుపుకుంటున్నానని, ముఖ్యంగా వైజాగ్ ప్రజల తరఫున విచారం వ్యక్తం చేస్తున్నామని ట్వీట్ చేశారు. లులూ గ్రూప్ వైజాగ్ లో కాలుమోపితే వేలాది ఉద్యోగాల కల్పన జరిగేదని, స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఎంతో ఊతం లభించేదని అభిప్రాయపడ్డారు.
గల్ఫ్ కేంద్రంగా వ్యాపారాలు నిర్వహించే లులూ గ్రూప్ వైజాగ్ లో ఫైవ్ స్టార్ హోటల్, భారీ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్, షాపింగ్ మాల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. అయితే, లులూ గ్రూప్ కు భూ కేటాయింపులను నిలిపివేయాలని వైసీపీ సర్కారు నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో తాము ఏపీలో పెట్టుబడి పెట్టలేకపోతున్నామని, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో మాత్రం తమ ప్రాజెక్టులు కొనసాగుతాయని లులూ గ్రూప్ ఓ ప్రకటనలో వెల్లడించింది.