Congress MPs Protest in Parliament: పార్లమెంట్ ఉభయసభల్లో కాంగ్రెస్ సభ్యుల నిరసన

  • ఎలక్టోరల్ బాండ్ల జారీలో కుంభకోణం జరిగిందంటూ ఆరోపణ
  • వెల్ లోకి దూసుకెళ్లి నిరసన, లోక్ సభనుంచి వాకౌట్
  • రాజ్యసభలో అదేతీరు.. సభను వాయిదా వేసిన ఛైర్మన్

పార్లమెంట్ ఉభయ సభల్లో కాంగ్రెస్ ఈ రోజు నిరసన చేపట్టింది. ఎలక్టోరల్ బాండ్లు, ప్రభుత్వం రంగ సంస్థల ప్రైవేటీకరణ అంశాన్ని లేవనెత్తిన కాంగ్రెస్ సభ్యులు ఇందులో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ఇది కుంభకోణమని పేర్కొంటూ పోడియంలోకి దూసుకెళ్లి నిరసన తెలిపారు. కాంగ్రెస్ లోక్ సభాపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ.. ఎలక్టోరల్ బాండ్ల జారీ, ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయించడం పెద్ద కుంభకోణమని ఆరోపించారు.

మరోవైపు స్పీకర్ ఓం బిర్లా సభ్యులకు వినతి చేసినా..కాంగ్రెస్ సభ్యులు పట్టించుకోకుండా పోడియంలోకి ప్రవేశించి 15 నిమిషాలపాటు ఆందోళన చేపట్టారు. 'మీరు సీనియర్ సభ్యులు, దయచేసి వెల్ లోకి రావద్దు' అని స్పీకర్ అన్నారు. మీరు లేవనెత్తిన అంశాలపై జీరో అవర్ లో అవకాశం కల్పిస్తానని  చెప్పారు. అనంతరం కాంగ్రెస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.

ఇక  అటు రాజ్యసభలోనూ కాంగ్రెస్ సభ్యులు ఎలక్టోరల్ బాండ్ల జారీపై రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడుకి నోటీసు ఇచ్చారు. సభలో ఈ రోజు చర్చించాల్సిన అంశాలు ఉన్నాయని చెప్పడంతో కాంగ్రెస్ సభ్యులు నిరసనకు దిగారు. దీంతో ఛైర్మన్ రాజ్యసభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News