Subhash Chandra: జీ ఎంటర్ టైన్ మెంట్ పై ఆధిపత్యాన్ని కోల్పోనున్న మీడియా బ్యారన్ సుభాష్ చంద్ర
- 16.5 శాతం వాటాను విక్రయించనున్నట్టు ప్రకటించిన ఎస్సెల్ గ్రూపు
- 5 శాతానికి పరిమితం కానున్న సుభాష్ చంద్ర వాటా
- ఈ ఏడాది ప్రారంభంలో కూడా 11 శాతం వాటాను అమ్మిన ఎస్సెల్ గ్రూపు
మీడియా దిగ్గజం జీ ఎంటర్ టైన్ మెంట్ పై మీడియా బ్యారన్ సుభాష్ చంద్ర ఆధిపత్యాన్ని కోల్పోనున్నారు. జీ ఎంటర్ టైన్ మెంట్ లో 16.5 శాతం వాటాను విక్రయించబోతున్నట్టు ఆయనకు చెందిన ఎస్సెల్ గ్రూప్ సంస్థ నిన్న ప్రకటించింది. ఈ లావాదేవీలు పూర్తైతే జీ ఎంటర్ టైన్ మెంట్ లో సుభాష్ చంద్ర వాటా 5 శాతానికి పరిమితమవుతుంది. ఈ నేపథ్యంలో దానిపై ఆయన కంట్రోల్ ను కోల్పోతారు.
భారత టెలివిజన్ ఎంటర్ టైన్ మెంట్ పరిశ్రమలో జీ మీడియా అగ్రస్థానంలో కొనసాగుతోంది. 1992లో సుభాష్ చంద్ర దీన్ని స్థాపించారు. ఆ తర్వాత ఆయన తన వ్యాపారాన్ని ప్యాకేజింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, విద్య, విలువైన లోహాలు, ఫైనాన్స్, టెక్నాలజీ రంగాలకు విస్తరించారు. ఫైనాన్షియల్ ఇన్వెస్టర్లకు బకాయిలను తీర్చేందుకే 16.5 వాటాను విక్రయిస్తున్నట్టు ఎస్సెల్ గ్రూపు ప్రకటించింది. ఈ ఏడాది ప్రారంభంలో కూడా జీ మీడియాలోని 11 శాతం వాటాను ఇన్వెస్కో సంస్థకు రూ. 4,224 కోట్లకు ఎస్సెల్ గ్రూపు విక్రయించింది.