Julian Assanje: అసాంజేపై లైంగిక వేధింపుల విచారణను నిలిపివేసిన స్వీడన్
- అసాంజేపై ఆరోపణలు చేసిన మహిళ
- బలమైన సాక్ష్యాలు లేవని భావించిన స్వీడన్
- కేసును శాశ్వతంగా మూసివేస్తున్నట్టు ప్రకటన
వికీలీక్స్ తో అగ్రరాజ్యాలకు కంట్లో నలుసులా మారిన జూలియన్ అసాంజేపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై తాము చేపట్టిన విచారణను స్వీడన్ ప్రభుత్వం శాశ్వతంగా నిలిపివేసింది. 2010లో తనపై అసాంజే లైంగిక దాడికి పాల్పడినట్టు ఓ స్వీడన్ మహిళ ఆరోపించింది. దీనిపై విచారణ మొదలుపెట్టిన స్వీడన్ ప్రాసిక్యూషన్ విభాగం సదరు మహిళ చేసిన ఆరోపణలు నమ్మశక్యంగానే ఉన్నట్టు అభిప్రాయపడింది.
అయితే, అసాంజే నేరానికి పాల్పడినట్టు నిరూపించడానికి తగినవిధంగా బలమైన సాక్ష్యాధారాలు లేవని స్వీడన్ పబ్లిక్ ప్రాసిక్యూషన్స్ డిప్యూటీ డైరెక్టర్ ఇవా మేరీ పెర్సోన్ వెల్లడించారు. స్వీడన్ చట్టాన్ని అనుసరించి 2020 ఆగస్టులోపు నేర నిరూపణ చేయలేకపోతే ఈ కేసు వీగిపోతుంది. వాస్తవానికి అసాంజే లండన్ లోని ఈక్వెడార్ ఎంబసీలో తలదాచుకోవడంతో 2017లోనే స్వీడన్ ఈ కేసును మూసివేసింది. ఇటీవలే అసాంజేను పోలీసులు అరెస్ట్ చేయడంతో కేసును మళ్లీ కొనసాగించారు.