Telangana: ఆర్టీసీ కార్మికులపై ప్రభుత్వం స్పందించకపోతే.. పెద్దఎత్తున కార్యాచరణకు దిగుతాం: కోదండరామ్
- ఆర్టీసీ కార్మికుల విషయమై ప్రభుత్వం స్పందించాలి
- ప్రభుత్వం విజ్ఞతతో వ్యవహరించాలి
- సమస్యకు పరిష్కారం చూపుతుందని ఆశిస్తున్నా
కేసీఆర్ నియంతృత్వ ధోరణికి వ్యతిరేకంగా పోరాడుతున్న ఆర్టీసీ కార్మికులు.. తెలంగాణ సమాజం ఆత్మగౌరవంతో బతకడానికి ఓ మార్గాన్ని చూపించారని తెలంగాణ జన సమితి (టీజేఎస్) ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కార్మికులకు నష్టం జరగకుండా, కోర్టు పెట్టిన న్యాయసమ్మతమైన ఓ చట్రంలో నిలబడి వారి సమస్యలకు పరిష్కారం కోసం ఒక ప్రయత్నం జరగాలని అన్నారు.
ఆర్టీసీ కార్మికుల విషయమై స్పందించాల్సిన ప్రభుత్వం స్పందించకపోతే రాజకీయపార్టీల నాయకులుగా తాము ఏమి చేయాలో, కార్మికులుగా వాళ్లు ఏం చేయాలో ఆలోచించుకుంటామని, కలిసి మాట్లాడుకుంటామని, జేఏసీతో చర్చిస్తామని, పెద్ద ఎత్తున కార్యాచరణకు పూనుకోవాల్సిన అవశ్యకత వుందని చెప్పారు. ఇదంతా జరగకుండా వుండాలంటే ప్రభుత్వం విజ్ఞతతో వ్యవహరించి సమస్యకు పరిష్కారం చూపుతుందని ఆశిస్తున్నామన్నారు.