Telugudesam: ‘రైతు భరోసా’ కోసం మిగతా పథకాలు ఆగిపోయాయన్నది పచ్చి అబద్ధం: ఏపీ మంత్రి కన్నబాబు
- రూ.65 వేల కోట్ల పెండింగ్ బిల్లులతో ఉన్న ప్రభుత్వాన్ని మాకు అప్పగించారు
- చంద్రబాబు చేసిన తప్పుకు ప్రజలు బలికాకూడదు
- ఇచ్చిన మాట ప్రకారం పథకాలు అమలు చేస్తున్నాం
అరవై ఐదు వేల కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులతో ఉన్న ప్రభుత్వాన్ని చంద్రబాబునాయుడు తమకు అప్పగించారని ఏపీ మంత్రి కన్నబాబు అన్నారు. ఏపీ సచివాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చివరకు, చంద్రబాబు హయాంలో రైతు రుణమాఫీ కోసం బ్యాంకుల నుంచి తీసుకొచ్చిన మూడు వేల కోట్ల రూపాయలను కూడా ‘పసుపు-కుంకుమ’ పథకానికి మళ్లించారని, అటువంటి పరిస్థితుల్లో వున్న ఖజానాను తమ ప్రభుత్వానికి అప్పగించారని చెప్పారు. అయినప్పటికీ, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి తమ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని చెప్పారు. ‘రైతు భరోసా’ కోసం మిగతా పథకాలు ఆగిపోయాయని, డబ్బులు ఇవ్వడం లేదన్న ఆరోపణలు పచ్చి అబద్ధం అని అన్నారు.
'అరవై ఐదు వేల కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు పెట్టి వెళ్లిపోయిన చంద్రబాబునాయుడుది ఈ రోజున బోనులో నిలబడే పరిస్థితి' అని విమర్శించారు. చంద్రబాబు చేసిన తప్పుకు ప్రజలు బలికాకూడదని చెప్పి ఆయన హయాంలో మొక్కజొన్న రైతులకు ఇచ్చిన హామీని జగన్ అమలు చేశారని అన్నారు. తమ ప్రభుత్వం అంకెల గారడీ ప్రభుత్వం కాదని, వ్యవసాయ శాఖను రైతులకు చేరువ చేస్తున్నామని అన్నారు.