Lok Sabha: లోక్ సభ నుంచి వాకౌట్ చేసిన కాంగ్రెస్

  • గాంధీ కుటుంబానికి ఎస్పీజీ తొలగింపుపై లోక్ సభలో ఆందోళన
  • మోదీ, అమిత్ షా సమాధానం చెప్పాలంటూ డిమాండ్
  • ఆందోళనను పట్టించుకోని స్పీకర్ ఓం బిర్లా

గాంధీ కుటుంబానికి స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ భద్రతను తొలగించడంపై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలని లోక్ సభలో కాంగ్రెస్ డిమాండ్ చేసింది. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీలకు ఎస్పీజీ భద్రతను తొలగించడంపై సమాధానం చెప్పాలంటూ కాంగ్రెస్ ఎంపీలు ఆందోళన చేస్తున్న సమయంలోనే... అమిత్ షా లోక్ సభ నుంచి రాజ్యసభకు వెళ్లిపోయారు.

ఈ నేపథ్యంలో, కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ సభ్యులు లోక్ సభలో వెల్ లోకి దూసుకుపోయి నినాదాలు చేశారు. సభ్యులంతా తమ స్థానాలకు వెళ్లాలని స్పీకర్ ఓం బిర్లా కోరారు. రైతుల సమస్యపై ఈరోజు చర్చ ఉందని... ఇలాంటి కీలక సమస్యపై చర్చించడానికి మీరు ఆసక్తిని కనబరచకపోవడం మంచిది కాదని వ్యాఖ్యానించారు.

అయినా స్పీకర్ మాటలను కాంగ్రెస్, ఎన్సీపీ ఎంపీలు పట్టించుకోలేదు. కక్ష సాధింపు రాజకీయాలను ఆపండి, నియంతృత్వ పోకడలకు ముగింపు పలకండి, వీ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. వీటిని పట్టించుకోని స్పీకర్ మరో అంశాన్ని చర్చకు స్వీకరించారు. దీంతో, వీరంతా సభ నుంచి వాకౌట్ చేశారు.

సోనియా, రాహుల్, ప్రియాంకలకు ఎస్పీజీ భద్రతను తొలగించి... సీఆర్పీఎఫ్ బలగాలతో జెడ్ ప్లస్ సెక్యూరిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News