India: అందుకే ఐరాస భద్రతా మండలిలో భారత్ కు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలి: ఆస్ట్రేలియా మాజీ ప్రధాని
- సైనిక, ఆర్థిక సామర్థ్యాలతో పాటు జనాభా వంటి అన్ని అర్హతలు ఉన్నాయి
- భద్రతా మండలిలో రెండు బలమైన ప్రజాస్వామ్య దేశాలు ఉండాలి
- కేవలం ఒక్కటి మాత్రమే ఉంటే సరిపోదు
ఐకరాజ్య సమితి భద్రతా మండలిలో ఏ దేశానికైనా సైనిక, ఆర్థిక సామర్థ్యాలతో పాటు జనాభా ప్రాతిపదికగా శాశ్వత సభ్యత్వ హోదా ఇవ్వాల్సి ఉంటే భారత్ ఇందుకు పూర్తిగా అర్హత ఉన్న దేశమని ఆస్ట్రేలియా మాజీ ప్రధాని టోనీ అబోట్ అన్నారు. భద్రతా మండలిలో రెండు బలమైన ప్రజాస్వామ్య దేశాలు ఉండాలని తెలిపారు. కేవలం ఒక్కటి మాత్రమే ఉంటే సరిపోదని అభిప్రాయపడ్డారు.
ఢిల్లీలో నిర్వహించిన ఓ సదస్సులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... ప్రస్తుతం భారత ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఆత్మపరిశీలన చేసుకునే స్థాయి నుంచి ప్రపంచంలో బలంగా గళం వినిపించే స్థాయికి భారత్ ఎదిగిందన్నారు. అంతర్జాతీయంగా భారత్ కీలక పాత్ర పొషించే స్థాయికి చేరుకుందని తెలిపారు. ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై భారత్ సంతకం చేయకపోవడాన్ని ఆయన సమర్థించారు. ఇలాంటి ఒప్పందం వల్ల దేశంలో సులభతర వాణిజ్యానికి మెరుగైన అవకాశాలు ఉంటాయని, అయితే దేశ ప్రయోజనాలు కూడా ముఖ్యమేనని తెలిపారు.