IPL-2020: ముంబై ఇండియన్స్ జట్టులోకి బౌల్ట్, షెర్పాన్ రూథర్ ఫర్డ్, ధవళ్ కులకర్ణి
- ఐపీఎల్-2020 దృష్ట్యా జట్టులో మార్పులు చేపట్టిన ముంబై ఇండియన్స్
- జట్టు నుంచి యువరాజ్ సహా 12 మంది ఆటగాళ్ల విడుదల
- ఐదుగురు దేశవాళీ, ఇద్దరు విదేశీ క్రికెటర్లు అవసరమన్న జట్టు డైరెక్టర్ జహీర్ ఖాన్
ఐపీఎల్ 2020 దృష్ట్యా ముంబై ఇండియన్స్ జట్టు మార్పులు చేపట్టింది. గత ఏడాది విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్ రానున్న సీజన్ కోసం ఆటగాళ్ల బదిలీ నిమిత్తం ట్రేడింగ్ జరిపింది. యువరాజ్ సింగ్ తో సహా ఎవిన్ లూయీస్, ఆడమ్ మిల్నె, బెరెన్ డార్ఫ్, బరిందర్ శరణ్, బెన్ కటింగ్, అల్జారీ జోసెఫ్, బ్యూరాన్ హెండ్రిక్స్ , రషీక్ సలామ్, పంకజ్ జైశ్వాల్ లను విడుదల చేసింది.
కాగా, జట్టులోకి ఇద్దరు విదేశీ ఆటగాళ్లు, ఒక భారత ఆటగాడు బదిలీపై వచ్చారు. వీరిలో న్యూజిలాండ్ కు చెందిన ట్రెంట్ బౌల్ట్, వెస్టిండీస్ కు చెందిన ఆల్ రౌండర్ షెర్పాన్ రూథర్ ఫర్డ్, భారత ఆటగాడు ధవళ్ కులకర్ణి ఉన్నారు. ఈ మేరకు వివరాలను ముంబై ఇండియన్స్ క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ జహీర్ ఖాన్ తెలిపాడు.
‘అనుభవమున్న కీలక ఆటగాళ్లు జట్టులో ఉన్నప్పటికీ వారిలో కొంతమంది గాయాలతో బాధపడుతున్నారు. శస్త్ర చికిత్స చేయించుకున్న హార్ధిక్ పాండ్యా తిరిగి బరిలోకి దిగడానికి ప్రయత్నిస్తున్నాడు. జస్ప్రీత్ బుమ్రా, బెరెన్ డార్ఫ్ లు వెన్ను గాయాలతో సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో ట్రేడింగ్ విండోలో కొందరు ఆటగాళ్లను తీసుకున్నాం. బౌలింగ్ విభాగాన్ని పటిష్ఠం చేయాలని ఢిల్లీ, రాజస్థాన్ జట్ల నుంచి ఆటగాళ్లను బదిలీ చేసుకున్నాం. 2020 ఐపీఎల్ వేలంలో దేశీవాళీ ఆటగాళ్లను దక్కించుకునేందుకు దృష్టిపెడతాం. మాకు ఐదుగురు దేశవాళీ క్రికెటర్లు, ఇద్దరు విదేశీయులు అవసరం’ అని చెప్పాడు.