Nara Lokesh: రైతులను వేధించినవారికి పుట్టగతులు ఉండవన్న విషయాన్ని జగన్ గుర్తుంచుకోవాలి: నారా లోకేశ్
- వైసీపీ పాలన విధ్వంసంతో ఆరంభమైందని వ్యాఖ్యలు
- రైతులను పొలాలకు వెళ్లనివ్వడంలేదని ఆరోపణ
- మానవ హక్కుల సంఘాలు పర్యటించే రోజులు వచ్చాయని విమర్శలు
ప్రకాశం జిల్లా కోనంకి గ్రామంలో టీడీపీకి ఓటేశారన్న అక్కసుతో కొందరు రైతులను వారి పొలాలకు వెళ్లనివ్వకుండా రోడ్డును తవ్వేశారని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది వైసీపీ నేతల నిర్వాకమని ఆరోపించారు. వైసీపీ పాలనే విధ్వంసంతో ఆరంభమైందని, అరాచకం తప్ప అభివృద్ధి, సంక్షేమం ఎక్కడుంటాయని విమర్శించారు.
మొన్నటికిమొన్న పల్నాడు ప్రాంతంలో 127 ఎస్సీ కుటుంబాలకు గ్రామ బహిష్కరణ విధించారని, సన్న, చిన్నకారు రైతులను తమ పొలాలకు వెళ్లనివ్వకుండా చేయడమే జగన్ గారు తెచ్చిన స్వర్ణ యుగమా? అని ప్రశ్నించారు. రైతులను వేధించిన వారికి పుట్టగతులు ఉండవన్న విషయాన్ని జగన్ గారు గుర్తుంచుకోవాలని నారా లోకేశ్ హెచ్చరించారు. రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే దేశంలో ఉన్న అన్ని మానవ హక్కుల సంఘాలు రాష్ట్రంలో పర్యటించాల్సిన రోజులు దగ్గరపడ్డాయనిపిస్తోందని వ్యాఖ్యానించారు.