Engagement: నేడు నిశ్చితార్థం... వద్దంటూ యువతి ఫిర్యాదు... పోలీసుల ఎదుట తల్లిదండ్రుల కన్నీరు!
- తెలంగాణ పరిధిలోని తాండూరులో ఘటన
- నేడు నిశ్చితార్థం, పోలీసుల వద్దకు యువతి
- తమ పరువు ఏం కావాలంటూ వాపోయిన తల్లిదండ్రులు
మేజర్ అయిన తనకు ఇష్టం లేకుండా పెళ్లి చేస్తున్నారని, ఓ యువతి పోలీసులను ఆశ్రయించగా, కౌన్సెలింగ్ నిమిత్తం తల్లిదండ్రులను పిలిపించిన వేళ, తమ పరువు ఏం కావాలని వారు కన్నీరు పెట్టుకున్నారు. ఈ ఘటన తెలంగాణ పరిధిలోని బషీరాబాద్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే, తాను డిగ్రీ చదువుతున్నానని, మరిన్ని ఉన్నత చదువులు చదవాలన్న కోరిక ఉందని, తల్లిదండ్రలు ఇష్టం లేని పెళ్లి చేస్తూ, ఆదివారం నాడు నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేశారని ఓ యువతి తాండూరు గ్రామీణ సీఐ జలందర్‌రెడ్డికి ఫిర్యదు చేసింది. తన జీవితం గురించి తాను చూసుకోగలనని, ఆ శక్తి తనకుందని చెప్పింది.
దీంతో స్పందించిన పోలీసులు, యువతి తల్లిదండ్రులను కౌన్సెలింగ్ నిమిత్తం పిలిపించారు. అమ్మాయికి ఇష్టంలేని వివాహం చేయవద్దని అధికారులు చెప్పగా, వారు కన్నీటి పర్యంతం అయ్యారు. ఇప్పటికే పెళ్లి చూపులు ముగిశాయని, నిశ్చితార్థం ఆపేస్తే, తమ పరువు, మర్యాదలు ఏం కావాలని వారు వాపోయారు. అమ్మాయి మేజర్ కావడంతో, ఆమె ఇష్ట ప్రకారమే వివాహం జరిపించాలే తప్ప, మరోమారు ఇలా చేయవద్దని పోలీసులు హెచ్చరించారు. తమ బిడ్డను ఇంటికి తీసుకెళ్లి, మాట్లాడుతామని వారు చెప్పడంతో, పోలీసులు అందరినీ ఇంటికి పంపారు. కాగా, 20 సంవత్సరాలున్న అమ్మాయిని 40 ఏళ్ల వ్యక్తితో పెళ్లి నిశ్చయించడమే, ఈ మొత్తం ఘటనకు కారణమని తెలుస్తోంది.