Telangana: నడికుడి మార్గాన్ని డబ్లింగ్ లైన్ చేయాలి: ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి
- దక్షిణ మధ్య రైల్వే జీఎం మాల్యాతో భేటీ అయిన ఎంపీ
- పెండింగ్ ప్రాజెక్టులు, రైల్వే లైన్ల విస్తరణపై చర్చ
- త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తానని తెలిపిన మాల్యా
ఉమ్మడి నల్గొండ జిల్లా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని రైల్వే స్టేషన్ల వద్ద పలు రైళ్లకు హాల్ట్ సదుపాయం కల్పించాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యాను కోరారు. ఈ రోజు కోమటిరెడ్డి సికింద్రబాద్ రైల్ నిలయంలో మాల్యాతో సమావేశమయ్యారు. పెండింగ్ ప్రాజెక్టులు, రైల్వే లైన్ల విస్తరణ అంశాలపై చర్చించారు. ఈ మేరకు వివరాలను ఎంపీ మీడియాకు తెలిపారు.
ఎంఎంటీఎస్ ను యాదగిరి గుట్ట మీదుగా జనగామ వరకు పొడిగించాలని విజ్ఞప్తి చేశానన్నారు. నడికుడి మార్గాన్ని డబ్లింగ్ లైన్ చేయాలని, చిట్యాల-సిరిపుర రైల్వే స్టేషన్ల మధ్య గేటు వద్ద ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టలని కోరామన్నారు. భువనగిరి రైల్వే స్టేషన్లో శాతవాహన, పద్మావతి, కోణార్క్, మచిలీపట్నం ఎక్స్ ప్రెస్ రైళ్లు ఆపాలని, ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని వినతి చేశామన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట రైల్వే స్టేషన్ లో పునర్నిర్మాణ పనులతో పాటు చైన్నై, శబరి, కోవ, డెల్టా ఫాస్ట్ ప్యాసింజర్ రైళ్లకు ఇక్కడ హాల్ట్ చేయాలని విజ్ఞప్తి చేశామని చెప్పారు. తాను చేసిన విజ్ఞప్తులకు జీఎం మాల్యా సానుకూలంగా స్పందించారన్నారు. సాధ్యమైనంత తొందర్లోనే సమస్యలను పరిష్కరిస్తానని చెప్పారని ఎంపీ వెల్లడించారు.